
Murder: మెదక్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటు చేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే కన్న కుమారుడిని హత్య చేసిన అమానుష ఘటన మెదక్ మండలంలోని పెద్దబాయి తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ బంధాలపై నమ్మకాన్ని కుదిపేసేలా జరిగిన ఈ దారుణం గ్రామస్థులను తీవ్ర విషాదంలో ముంచింది.
మెదక్ గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దబాయి తండాకు చెందిన బదావత్ భాస్కర్ కు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త భార్య ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా భాస్కర్ కు తన కుమారుడు తనకు పుట్టలేదన్న అనుమానం ఏర్పడింది. ఈ అనుమానమే కుటుంబంలో తరచూ గొడవలకు కారణంగా మారింది.
భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం భాస్కర్ తన భార్యను తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో మూడేళ్ల కుమారుడు తండ్రి వద్దనే ఉండిపోయాడు. రెండు రోజుల పాటు తండ్రితోనే ఉన్న ఆ చిన్నారి పట్ల భాస్కర్ లోని అనుమానం మరింత తీవ్ర రూపం దాల్చింది.
ఆ అనుమానంతోనే ఆదివారం నాడు భాస్కర్ తాడుతో కుమారుడి గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న మెదక్ గ్రామీణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలు అనుమానాలుగా మారి చివరకు అమానుష హత్యకు దారి తీసిన ఈ ఘటన సమాజాన్ని ఆలోచింపజేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి తండా గ్రామంలో విషాద ఛాయలు నింపింది.





