
Murder Case: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంట గ్రామంలో నెలల తరబడి కొనసాగే ఒక రహస్య హత్య కేసు, చివరకు 6 నెలల కఠినమైన విచారణ తరువాత వెలుగు చూసింది. సాధారణంగా శాంతియుతంగా కనిపించే గ్రామీణ వాతావరణం వెనుక అంతుచిక్కని మాయాజాలం, మోసం, అక్రమ సంబంధం, క్రూరమైన కుట్ర దాగి ఉండొచ్చని ఈ ఘటన అందరికీ స్పష్టంగా తెలియజేసింది. రామప్ప, గంగాభవాని అనే దంపతుల జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, పోలీసులను మాత్రమే కాకుండా మొత్తం జిల్లాను షాక్‌కు గురిచేశాయి.
గతంలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. రామప్ప మృతదేహం ఆగస్టు 8న బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహంగా కనబడింది. కాళ్లు, చేతులు కట్టేసి చాపలో చుట్టి రిజర్వాయర్‌లో పడేసిన స్థితిలో ఉండటం వల్ల ఇది ప్లానింగ్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు మొదటి నుంచి అనుమానించారు. డెడ్ బాడీ దొరికే సమయానికి 10 రోజులు గడిచిపోయినందున శరీరం పూర్తిగా డికంపోజ్ అయిపోయింది. దీంతో మృతుడిని గుర్తించడం దాదాపు అసాధ్యమైపోయింది.
అయినప్పటికీ మృతుడి చేతిలో ఉన్న రాగి కడియం ఆధారంగా పోలీసుల కనిపెట్టారు. ఇదే ఆధారంగా దర్యాప్తు ఒక కొత్త దిశలోకి మలుపు తిరిగింది. రిజర్వాయర్ పరిసరాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసుల బృందం సేకరించడం, టవర్ లొకేషన్లను అనుసంధానం చేయడం, రాత్రి సమయంలో ఏ ఫోన్‌లు ఆ ప్రాంతంలో కదలాడాయో తెలుసుకోవడం ద్వారా రామప్ప మిస్సింగ్ కేసు కానప్పటికీ అతను ఎవరో పసిగట్టగలిగారు. చివరకు మృతుడు వంకరకుంట గ్రామానికి చెందిన రామప్ప అని నిర్ధారించారు.
ఇంతలో మరొక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. భర్త కనిపించడంలేదని భార్య గంగాభవాని ఏ రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు ఇవ్వలేదు. సాధారణంగా భర్త తిరిగి రాకపోతే మొదట ఆందోళన చెందేది భార్యే. కానీ గంగాభవాని చల్లగా వ్యవహరించడం, ఏ ప్రయత్నం చేయకపోవడం పోలీసుల అనుమానాలను మరింత పెంచింది.
దర్యాప్తు మరింత లోతుగా సాగినప్పుడు.. రామప్ప భార్య గంగాభవాని, అదే గ్రామానికి చెందిన గంగాధ్రి మధ్య ఉన్న అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. రామప్ప ప్రతిరోజూ మద్యం తాగి భార్యను వేధించడం, ఆ అక్రమ సంబంధాన్ని గుర్తించడం, అడ్డుపడడం వంటి కారణాలతో గంగాభవాని, తన ప్రియుడు గంగాధ్రితో కలిసి రామప్పను హత్య చేయాలని నిశ్చయించుకుంది. దానికి మరో ఇద్దరు వ్యక్తులు విష్ణు, సుదర్శన్ కూడా సహకరించారు.
జూలై 27న రాత్రి రామప్పకు భార్య మద్యం తాగించి, పూర్తిగా మత్తులోకి నెట్టింది. ఆ తరువాత ప్రియుడు గంగాధ్రి, అతని స్నేహితులు కలిసి ముందుగా రామప్ప తలపై బండరాయితో దాడి చేసి, తరువాత గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. నేరం చేసిన తరువాత దేహాన్ని చాపలో చుట్టి రిజర్వాయర్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, బైక్ పంచర్ కావడంతో ఆటో ద్వారా మృతదేహాన్ని తరలించారు. రిజర్వాయర్ వద్ద కాళ్లు, చేతులు కట్టి నీటిలో పడేశారు.
హత్య అనంతరం, గంగాభవాని ఎవరికీ అనుమానం రాకుండా రోజువారీ జీవితాన్ని కొనసాగించినా.. పోలీసులు సాంకేతిక ఆధారాలు ఉపయోగించడం వల్ల చివరకు నిజాన్ని బయటపెట్టగలిగారు. రిజర్వాయర్ చుట్టూ హత్య జరిగిన రాత్రి పలువురు నిందితుల ఫోన్ లొకేషన్లు కనబడటం, తదుపరి విచారణ, నిందితులను అరెస్ట్ చేయడం ఇలా అన్ని ఆధారాలు గంగాభవాని కుట్ర ఎంత సీక్రెట్‌గా ఉన్నప్పటికీ పోలీసులు దాన్ని ఛేదించారు.
రామప్ప హత్య కేసును ఎస్పీ సతీష్‌కుమార్ ప్రత్యేకంగా పర్యవేక్షించడంతో 6 నెలల అనంతరం కేసు మిస్టరీను పోలీసులు ఛేదించి, భార్యను ప్రధాన నిందితురాలిగా, ప్రియుడు గంగాధ్రిని ఎ2గా, సహచరులైన విష్ణు, సుదర్శన్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కుటుంబ సమస్యలు హత్యల వరకు వెళ్లకూడదని, ఇలాంటి సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Take Care: పెళ్లికి ముందు ప్రియుడితో యువతి.. వీడియోలు తీసి..





