
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియలో మరో ప్రధాన అడుగు పడింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్డులతో పాటు చైర్‌పర్సన్, మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా ఈ రిజర్వేషన్లను నిర్ణయించినట్లు అధికారిక ఉత్తర్వుల్లో వెల్లడైంది.
బీసీ వర్గాలకు ప్రభుత్వం కీలక ప్రాధాన్యం కల్పించింది. మొత్తం చైర్‌పర్సన్, మేయర్ పదవుల్లో 34 శాతం మేర బీసీలకు కేటాయించింది. ఇందులో భాగంగా 38 చైర్‌పర్సన్ స్థానాలు, 3 మేయర్ పదవులు బీసీలకు దక్కనున్నాయి. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జీవో నంబర్ 14ను జారీ చేశారు.
రిజర్వేషన్ల ఖరారుకు 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సులను అనుసరించినట్లు తెలిపారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వు చేయడం ఈ ఎన్నికల్లో మరో ప్రత్యేక అంశంగా మారింది.
తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 7, 28, 29 ప్రకారం ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు జీవోలో వివరించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఈ జీవోనే ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం సూచించింది. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికల నగారా మోగేందుకు ఇక పెద్దగా ఆలస్యం ఉండదన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో స్థానిక జనాభా ఆధారంగా వార్డుల రిజర్వేషన్లలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీసీలకు అత్యధికంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో 60 వార్డులకు గాను 26 వార్డులు, నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 వార్డులకు గాను 24 వార్డులు కేటాయించారు. మరోవైపు కొత్తగూడెం కార్పొరేషన్‌లో బీసీలకు కేవలం 7 వార్డులు, రామగుండం కార్పొరేషన్‌లో 16 వార్డులే దక్కాయి.
కొత్తగూడెంలో ఎస్టీ జనాభా అధికంగా ఉండటం, రామగుండంలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండటంతో ఆయా వర్గాలకు ఎక్కువ వార్డులు రిజర్వు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీసీలకు వార్డుల సంఖ్య పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 300 వార్డులకుగాను 122 వార్డులను బీసీలకు కేటాయించారు. ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, మహిళలకు 76 వార్డులు రిజర్వు చేయగా, మిగిలిన 74 వార్డులు అన్ రిజర్వుడ్‌గా ఉంచారు. ఈ కేటాయింపులు రానున్న ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై కీలక ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





