జాతీయంవైరల్సినిమా

Mouni Roy: తాత వయసున్న వారు నడుముపై చేయి వేసి, లో యాంగిల్‌లో ఫొటోలు తీశారు

Mouni Roy: ప్రముఖ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఎదుర్కొన్న చేదు అనుభవం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Mouni Roy: ప్రముఖ బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఎదుర్కొన్న చేదు అనుభవం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో కర్నల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తనకు ఎదురైన అవమానకర ఘటనలను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో, మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాన్స్ పేరుతో కొందరు వ్యక్తులు చేసిన అనుచిత ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని, ఇది ఒక కళాకారిణిగా తన గౌరవాన్ని దెబ్బతీసిందని మౌనీ రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వేడుకకు అతిథిగా హాజరైన సమయంలో స్టేజ్ వైపు వెళ్తుండగా అక్కడ ఉన్న కొందరు పురుషులు ఫోటోల పేరుతో తన నడుముపై చేతులు వేయడం తనకు అసహ్యం కలిగించిందని ఆమె తెలిపారు. దయచేసి చేయి తీసేయాలని చెప్పినా వారు వినిపించుకోకపోవడం మరింత బాధ కలిగించిందన్నారు. ముఖ్యంగా వయసులో పెద్దవారైన ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన తనను షాక్ కు గురి చేసిందని, ఇది మర్యాదకు మించిన దారుణమైన ప్రవర్తనగా పేర్కొన్నారు.

స్టేజ్ పైకి చేరుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని మౌనీ రాయ్ వివరించారు. స్టేజ్ ముందు నిలబడి కొందరు వ్యక్తులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అనుచిత సైగలు చేస్తూ పిలవడం తనకు తీవ్ర మానసిక వేదన కలిగించిందన్నారు. మొదట మర్యాదగా అలా చేయవద్దని సూచించినా వారు వినకపోవడంతో పాటు గులాబీలు విసురుతూ వేధించడం ప్రారంభించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రదర్శన మధ్యలోనే స్టేజ్ దిగి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

అయితే బాధను లోపలే దాచుకుని తిరిగి స్టేజ్ పైకి వచ్చి తన కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. అయినప్పటికీ ఆ వ్యక్తుల ప్రవర్తన ఆగకపోవడం, వారిని నియంత్రించేందుకు నిర్వాహకులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రయత్నం చేయకపోవడం తనను మరింత అవమానానికి గురిచేసిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు తనలాంటి సీనియర్ నటికి ఎదురైతే, కొత్తగా రంగంలోకి వచ్చే అమ్మాయిల పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే భయం వేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా స్టేజ్ ఎత్తులో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని కింద నుంచి అసభ్యకర కోణాల్లో వీడియోలు తీయడం మరో ఘోరమైన అంశమని మౌనీ రాయ్ తెలిపారు. ఎవరైనా వారిని ఆపమని చెప్పినప్పుడు వారిపై దూషణలకు దిగడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు. తన దేశం అంటే గౌరవం ఉందని, ఇక్కడి సంస్కృతి అంటే అభిమానమని చెప్పిన ఆమె.. ఇలాంటి ప్రవర్తనే మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందా అని ప్రశ్నించారు.

ఈ ఘటనపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మౌనీ రాయ్ కోరారు. మేము కళాకారులం, గౌరవంగా బతకాలని కోరుకుంటామని, తమ ఇంటి ఆడవాళ్లతో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే ఆ మగవాళ్లు ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న తరుణంలో, నిథి అగర్వాల్ ఘటన మరువక ముందే మరో హీరోయిన్ ఇలాంటి అనుభవం ఎదుర్కోవడం సినిమా పరిశ్రమను కలవరపెడుతోంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: డెలివరీ బాయ్‌కి రూ.21,000 టిప్! (VIDEO)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button