-
ప్రజా సమస్యలపై విచారణ ఓసి బాధితులకు హామీ
క్రైమ్ మిర్రర్,రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీలో కార్మిక–మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా 3, 4, 17, 19 వార్డుల్లో పర్యటించి కాలనీల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రోడ్లు, డ్రైనేజీ కాలువలు, విద్యుత్ ఫాల్స్, ఇందిరమ్మ ఇళ్ల కల్పన వంటి అంశాలపై కాలనీ వాసులు మంత్రికి వినతులు అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఆర్కే ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్ కారణంగా ఇళ్లకు నష్టం జరుగుతోందని, దుమ్ము–ధూళి వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

4వ వార్డును ఓపెన్‌కాస్ట్ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి పునరావాసం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.స్పందించిన మంత్రి, ఓసీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నిలిపివేసిన జీఓ 76ను అమలు చేసి ఇళ్ల క్రమబద్ధీకరణ చేపట్టాలని ప్రజలు కోరగా, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి సింగరేణి భూముల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వేలా ప్రయత్నిస్తానని మంత్రి తెలిపారు.కాలనీల్లో బెల్ట్ షాపుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఫిర్యాదు చేయగా, వాటిని వెంటనే అరికట్టాలని పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం 3, 18 వార్డుల్లో డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు గాండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





