
ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్నాయి. జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకవలసిన రుతుపవనాలు.. నాలుగు రోజుల ముందే అంటే మే 27న రానున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 4-5 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది.
ఇవాళ సోమలవారం 42-43.5 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలో పలుచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీశాయి. కోస్తాలో అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడం, వాయవ్య భారతం నుంచి వీచిన పొడిగాలులతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం AP లోని 144 ప్రాం తాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.