
తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను కోతి లాక్కెళ్లి బావిలో పడేసిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే విధి వింతగా, ఆ పసిబిడ్డకు వేసిన డైపర్‌నే ప్రాణరక్షకంగా మారింది. నీటిలో మునిగిపోకుండా డైపర్ సహాయంతో శిశువు ప్రాణాలతో బయటపడిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లా సియోని గ్రామానికి చెందిన సునీత తన ఇంటి వరండాలో 20 రోజుల పసిబిడ్డకు పాలిచ్చుకుంటోంది. ఈ సమయంలో 4 నుంచి 5 కోతులు అక్కడకు వచ్చాయి. ఒక్కసారిగా సునీత చేతిలో ఉన్న పసి పాపను ఒక కోతి లాక్కొని ఇంటి పైకెక్కింది.
దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. బిడ్డను కాపాడేందుకు కోతిని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. పటాకులు కాల్చి భయపెట్టేందుకు యత్నించినప్పటికీ, కోతి వెనక్కి తగ్గలేదు. చివరకు చేతిలో ఉన్న పసిబిడ్డను పొరుగింటి ఆవరణలో ఉన్న బావిలో పడేసింది.
ఈ ఘటనను చూసిన గ్రామస్తులు ఆందోళనతో బావి వద్దకు పరుగులు తీశారు. బావిలో పడిన పసిబిడ్డ నీటిపై తేలుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బిడ్డకు వేసిన డైపర్ గాలిని పట్టుకుని తేలేలా చేయడంతో, ఆ చిన్నారి నీటిలో మునగకుండా నిలిచినట్లు గుర్తించారు.
గ్రామస్తులు వెంటనే బకెట్లు, తాళ్ల సహాయంతో 10 నిమిషాల పాటు శ్రమించి ఆ పసిబిడ్డను బావి నుంచి బయటకు తీశారు. కొద్దిగా నీటిని మింగడంతో శిశువు అస్వస్థతకు గురైంది. అయితే అదృష్టవశాత్తు అదే గ్రామంలో ఓ వేడుక కోసం వచ్చిన రాజేశ్వరి అనే నర్సు వెంటనే స్పందించి శిశువుకు సీపీఆర్ చేశారు.
ఆ తర్వాత చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బావిలో పడినప్పటికీ డైపర్ కారణంగా పసిబిడ్డ ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
ALSO READ: ప్రియురాలు దూరం పెట్టిందని.. ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు





