తెలంగాణ

మరో 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాకు అలర్ట్!

Telangana Rains: అల్పపీడన ప్రభావానికి తోడు ఉపరితల ఆవర్తనం, రుతుపవన ధ్రోణి ప్రభావంతో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్‌, కొమురంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శనివారం కొమురంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భదాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్‌, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రికార్డు స్థాయి వర్షపాతం

ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గడిచిన 48 గంటల్లో 65 సెం.మీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 49.48 సెం.మీ, గురువారం మరో 16 సెం.మీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ జిల్లాల్లో సగటున 60 సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. జూన్‌లో 20 శాతం లోటు వర్షపాతం నమోదైనా జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో ఈ సీజన్‌లో 25 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 130.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 104.2 మి.మీ మాత్రమే కురిసింది. జూలైలో సగటు వర్షపాతం 227.4 మి.మీకి గాను 237.9 మి.మీ కురిసింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా గురువారం నాటికే 349.6 మి.మీ నమోదైంది. ఇది సాధారణం కంటే 80 శాతం, నిరుడితో పోలిస్తే 102 శాతం అధికమని వాతావరణ శాఖ వెల్లడించింది.

Back to top button