India-Russia Deals: రెండు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా రక్షణ, వాణిజ్య రంగంలో అత్యంత ముఖ్యమైన ఒప్పందాలు జరగనున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11.30 గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కీలక చర్చలు మొదలుకానున్నాయి.
హైదరాబాద్ హౌస్ లో కీలక చర్చలు
అటు హైదరాబాద్ హౌస్‌లో మొదలయ్యే ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్-మోడీ పాల్గొననున్నారు. రెండు గంటలపాటు సాగే ఈ సమావేశంలో.. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరుదేశాల వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేషియన్ ఎకనమిక్ యూనియన్‌తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకురానున్నాయి. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడిచమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారీగా పెరిగిపోతున్న వాణిజ్య లోటు గురించి భారత్ ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ చర్చ జరగనుంది. అలాగే.. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.
Welcomed my friend, President Putin to 7, Lok Kalyan Marg.@KremlinRussia_E pic.twitter.com/2L7AZ1WIph
— Narendra Modi (@narendramodi) December 4, 2025
మొత్తం 25 కీలక ఒప్పందాలు
ఈ సమావేశం తర్వాత రష్యా నుంచి కొత్తగా మరో ఐదు రెజిమెంట్ల ఎస్-400ల కొనుగోలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో వినియోగించిన క్షిపణుల స్థానంలో కొత్త మిస్సైళ్ల కొనుగోలు, రష్యాలో ప్రస్తుతం నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారతీయ కార్మికులు, పలు రంగాల నిపుణులు రష్యాకు వెళ్లడాన్ని సులభతరం చేసే, వారి హక్కులకు రక్షణ కల్పించే మొబిలిటీ ఒప్పందం, ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం, ఇరు దేశాల చెల్లింపు వ్యవస్థలైన రూపే-మిర్ అనుసంధానం సహా… 25 కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఈ ఒప్పందాల ఫలితంగా ఫార్మా, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు తదితర రంగాల్లో రష్యాకు భారత ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే.. రష్యా నుంచి అత్యంత అధునాతన ఎస్-500ల కొనుగోలు, ఐదో తరం యుద్ధవిమానాలైన ఎస్‌యు-57ల కొనుగోలు, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, అంతరిక్ష రంగం, అణు ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పోర్టుల అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి. సమావేశం ముగిశాక మధ్యాహ్నం 1.50 గంటలకు పుతిన్-మోడీసంయుక్త ప్రకటన విడుదల చేస్తారు.
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.@KremlinRussia_E pic.twitter.com/D2zczJXkU2
— Narendra Modi (@narendramodi) December 4, 2025
సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు హాజరై రాత్రి 9 గంటలకు మాస్కోకు తిరుగుప్రయాణం అవుతారు.అటు పుతిన్-మోడీ భేటీని అమెరికా సహా పలు ఆదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.





