
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. కొత్త ఇంచార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ పీసీసీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. మీనాక్షి ఎంట్రీతో గతంలో ఉన్న పరిణామాలన్ని చకచకా మారిపోతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా తెలియడం లేదు. గతంలో హామీ పొందిన నేతలు కూడా టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలను మూడు గ్రూపులుగా మీనాక్షి నటరాజన్ వేరు చేయడంతో పార్టీలో అసలేం జరగనుంది అన్నది కూడా ఎవరికి తెలియడం లేదు.
ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి కీలక ఘటన జరిగింది. అద్దంకి దయాకర్( Addanki Dayakar )కు ఈసారి ఎమ్మెల్సీ ఖాయమనే ప్రచారం సాగింది. గత రెండు సార్లు మిస్ కావడంతో ఈసారి ఆయన విషయంలో పక్కా అనుకున్నారు. కాని సడెన్ గా సీన్ మారిపోయింది. బంజారాహిల్స్ లోని మాజి మంత్రి జానారెడ్టి (Ex Minister JanaReddy) ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు సిఎం రేవంత్ రెడ్డి. దాదాపు గంట సేపు ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది. త్వరలో భర్తీ చేయబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల పై చర్చించినట్లు ప్రచారం.సామాజిక సమీకరణ పై జానారెడ్డి తో సీఎం మాట్లాడారని టాక్. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ (sankar Naik ) పేరు ను జానారెడ్డి రికమెండ్ చేసినట్లు చర్చ సాగుతోంది. St కోటాలో శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇవ్వాలని జానారెడ్డి సిఫార్సు చేసినట్లు ప్రచారం సాగుతోంది.
జానారెడ్డికి శిష్యుడిగా ఉన్నారు శంకర్ నాయక్. మిర్యాలగూడ, నాగార్జున సాగర్ టికెట్లను ఆయన ఆశించారు. నల్గొండ ఎంపీకి ఆయన పేరు వినిపించింది. అయితే ఏ సీటు ఆయనకు దక్కలేదు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీకి శంకర్ నాయక్ పేరును జానారెడ్డి సిఫారస్ చేశారని అంటున్నారు. శంకర్ నాయకు పేరును జానారెడ్డి సూచించడంతో అద్దంకి దయాకర్ కు అవకాశం లేనట్టేననే టాక్ వస్తోంది. కాంగ్రెస్ కు వచ్చేవి మూడు సీట్లు. అందులో రెండు ఒకే జిల్లాకు ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఈ లెక్కన జానారెడ్డి సూచించిన శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ ఇస్తే అద్దంకి దయాకర్ కు మరోసారి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చినట్లే.