
సంగారెడ్డి, క్రైమ్ మిర్రర్:- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై ఎమ్మెల్సీ కవిత అనుచరులు, జాగృతి కార్యకర్తలు జరిపిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. అధికారం పోయినా అగ్రవర్ణ అహంకారం తగ్గలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జాగృతి కార్యకర్తలు మల్లన్న పై దాడి చేశామని బహిరంగంగా ఒప్పుకున్నా చర్యలేవి..? అని ప్రశ్నించారు. “ఉద్దేశ్యపూర్వకంగానే మల్లన్న గారిపై దాడి చేశాం” అని ఎమ్మెల్సీ కవిత అనుచరులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని.? ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా.? అని అన్నారు.
Read also : GOOD NEWS: ఈ రోజు వీరు పట్టిందల్లా బంగారమే!
బీసీలు తమ హక్కుల కోసం ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ పెట్టుకుంటే, “పార్టీ పెట్టుకుని బతుకుతున్నావు” అని ఎద్దేవా చేయడం మీ సంస్కారహీనతకు నిదర్శనం అని అన్నారు. మీరు దశాబ్దాలుగా పార్టీల ముసుగులో పదవులు అనుభవిస్తూ ప్రజలను దోచుకోలేదా.? అంటూ విమర్శించారు. ఒక ఎమ్మెల్సీకే రక్షణ లేని ఈ పాలనలో, సామాన్య బీసీ పౌరులకు రక్షణ ఎక్కడ ఉంటుంది.? అని ఆందోళన వ్యక్తం చేశారు. కవిత అనుచరుల గూండాయిజానికి పోలీసులు భయపడుతున్నారా లేక వారికి సహకరిస్తున్నారా.? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ఇది మొత్తం బీసీ సమాజంపై జరిగిన దాడి. అగ్రవర్ణాల అహంకారంతో బీసీల గొంతు నొక్కాలని చూస్తే, మీ రాజకీయ పునాదులు కదిలిపోవడం ఖాయం అని అన్నారు.
దాడికి పాల్పడిన ఎమ్మెల్సీ కవిత అనుచరులపై, దానికి ఉసిగొల్పిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బీసీ సమాజాన్ని ఏకం చేసి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రమేష్ యాదవ్ హెచ్చరించారు.
Read also : మన ప్రధానమంత్రి ఆస్తులు ఎంతో తెలుసా..?





