
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందన్నారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో… కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు కవిత. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది… కానీ సరిగ్గా పనిచేయదని తెలిపారు.
మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని కవిత విమర్శించారు.ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశాలు పెట్టడం లేదన్నారు.
బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని కవిత స్పష్టం చేశారు.
మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని కవిత పిలుపిచ్చారు.తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలన్నారు. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని.. కాని లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారు. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవ పట్టించారని అన్నారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదని కవిత నిలదీశారు. 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని.. ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని అన్నారు. ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.