తెలంగాణరాజకీయం

పీచేముడ్‌ అంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు - బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటున్న ఎమ్మెల్యే గూడెం

2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి గందరగోళంగా మారింది. సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం.. నోటీసులు ఇవ్వడంతో… ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. అనర్హత వేటు పడుతుందేమో అని భయపడిపోతున్నారు. అంతా తూచ్‌.. మేము కాంగ్రెస్‌లో చేరలేదు… బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామంటూ ఒకరి తర్వాత మరొకరు ప్రకటనలు ఇస్తున్నారు. ఈ మధ్యన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి.. ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని అని.. తన పేరును కాంగ్రెస్‌ ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారని కంప్లెయింట్‌ ఇచ్చారు. ఇప్పుడు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి… తాను కాంగ్రెస్‌లో చేరలేదని.. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటూ… ఏకంగా సుప్రీంకోర్టుకే అఫిడవిట్‌ ఇచ్చారు. ఇలా… ఇంకెతమంది పీచేముడ్‌ అంటారో ఏమో మరి.

Read More : రేవంత్‌-భట్టి విక్రమార్కది సూపర్‌ జోడి… వైఎస్‌ఆర్‌-రోశయ్యలా..!

మొత్తం 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్‌ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం కేసు కోర్టు పరిశీలనలో ఉంది. ఈనెల 25న విచారణకు రానుంది. దీనికి సంబంధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు ఒక్కొక్కరుగా సమాధానాలు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు ఒకవేళ అనర్హత వేటు వేస్తే… ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉపఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో వారు మళ్లీ గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే… ప్లేట్‌ ఫిరాయిస్తున్నట్టు ఉన్నారు. ఆ భయంతోనే.. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చినట్టు ఉన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని… బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరినట్టు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. అది విన్న వారంతా.. అవునా… నిజమా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే.. గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలుసు. రేవంత్‌రెడ్డితో కండువా కప్పించుకున్న వీడియో కూడా ఉంది. గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. అయినా… ఇంత పచ్చి అబద్దం ఎలా చెప్పగలిగారు. అది కూడా కోర్టుకు. ఆయన ఇచ్చిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా…? ఒకవేళ తప్పుడు అఫిడవిట్‌ అని గుర్తిస్తే…? అప్పుడు ఎలా..? అది మరింత నేరం కాదా…? ఆ మాత్రం గూడెం మహిపాల్‌రెడ్డికి అర్థం కాలేదా…? ఏమో.. దీని పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Read More : బీఆర్‌ఎస్‌ వద్దు టీఆర్‌ఎస్‌ ముద్దు – పేరు మార్పుకు డేట్‌ ఫిక్స్‌ – తప్పు సరిచేసుకుంటున్న కేసీఆర్‌

గూడెం మహిపాల్‌రెడ్డి ఏ పరిస్థితిల్లో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారో ఏమో గానీ… ఆయన బీఆర్‌ఎస్‌కే మద్దతుగా ఉన్నారు. తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ ఫొటో అలాగే ఉంచేశారు. దీని వల్ల కాంగ్రెస్‌లో వర్గపోరు జరిగింది. కాటా శ్రీనివాస్‌ వర్సెస్‌ గూడెం మహిపాల్‌రెడ్డి మధ్య ఇప్పటికీ వార్‌ నడుస్తూనే ఉంది. కేసీఆర్‌ ఫొటో ఎందుకు పెట్టుకున్నారని కాటా వర్గం ప్రశ్నిస్తే.. కేసీఆర్‌ వల్లే ఎదిగా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నా… కనుక బరాబర్‌ పెట్టుకుంటా… అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు గూడెం. ఈ పంచాయతీపై పార్టీ విచారణ కూడా జరుపుతోంది. ఇంత జరిగాక… తాను కాంగ్రెస్‌లో చేరలేదని.. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఆయన చెప్పడం ఎంతవరకు కరెక్ట్‌..? కాంగ్రెస్‌లో ఉండలేను అనుకుంటే.. మళ్లీ బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటే సరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button