తెలంగాణ

క్రైమ్ మిర్రర్ కధనానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందన.

  • కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని సందర్శించిన మునుగోడు రాజన్న.

  • మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థినుల సమస్యలకు చెక్

  • తన సొంత డబ్బులతో గదులు, బాత్రూంల నిర్మాణం చేయిస్తానని హామీ

  • తన వ్యక్తిగత ఇంజనీర్లకు ఫోన్ చేసి రేపటి నుండి పనులు మొదలుపెట్టాలని ఆదేశం

  • హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.. విద్యార్థుల మనసులో దేవుడిగా నిలిచిన కోమటిరెడ్డి.

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- పిలుస్తే పలికే దేవుడిలా వరాలు ఇస్తున్నాడు మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన నియోజకవర్గంలో పేదల బ్రతుకులు చిగురించాలని, విద్యా వైద్యం, ప్రజల సమస్యలపై నిత్యం సైనికుడిలా పని చేస్తున్న రాజన్న, మరో సామాజిక సేవా కార్యక్రమాన్ని ముందేసుకొని ప్రజల్లో తనకంటూ ఓ బ్రాండ్ ను ఏర్పరుచుకున్నారు. తల్లి సుశీలమ్మ ఋణం తీర్చుకుంటూ, ఫౌండేషన్ పేరిట లక్షల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. తన నియోజకవర్గంలో ఏ మూలన ఏ సమస్య ఉన్నా మరుక్షణం ఆలోచించకుండా చర్యలు తీసుకునే రాజగోపాల్ రెడ్డికి జనం నిరాజనాలు పడుతున్నారు. కంటతడి పెట్టిస్తున్న కస్తూరిబా కష్టాలు అనే క్రైమ్ మిర్రర్ కధనంపై కోమటిరెడ్డి స్పందించారు. మర్రిగూడ మండల కేంద్రంలో కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆయన, వార్త కధనాన్ని చూసి కస్తూరిబా విద్యాలయాన్ని సందర్శించారు.

2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థినికి 15 వేల రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినికి 10వేల రూపాయలు, తృతీయ స్థానం సాధించిన విద్యార్థినికి 7500 రూపాయలను నగదు బహుమతిని అందించి, విద్యార్థులను శాలువాతో సన్మానించి, మెమెంటో అందించారు. కేజీబీవీకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, సిబ్బంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. కేజీబీవీ అంతా కలియతిరిగి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు. విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండడం, సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేవని, సిబ్బంది విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

వీటిలో ప్రధానమైనవి బాత్రూమ్స్ సమస్య, డార్మిటరీ హాల్స్ సమస్య, విద్యార్థినులు పడుకోవడానికి సరిపడా రూములు లేవని, ఒక్కో రూములో 60 మంది విద్యార్థినులు పడుకోవాల్సి వస్తుందని తెలుసుకున్నారు. వెంటనే చలించిన రాజన్న తన సొంత నిధులతో ఖాళీగా ఉన్న ఫస్ట్ ఫ్లోర్ పై, నాలుగు రూములు నిర్మించి ఇస్తానని, బాత్రూమ్స్ కూడా సరిపడా వెంటనే నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. తక్షణమే తన వ్యక్తిగత ఇంజనీర్ కు ఫోన్ చేసి రేపటినుండే నిర్మాణ పనులు మొదలుకావాలని ఆదేశించారు. వంటశాలకు వెళ్లి వండిన భోజనాన్ని తనిఖీ చేసి, సరిగ్గా వండుతున్నారా లేదా అని ఆరా తీశారు. తరగతి గదులకు వెళ్లి డార్మెటరీ హాల్స్ ను పరిశీలించి విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను కల్లారా చూశారు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థినుల తరగతి గదికి వెళ్లి, ప్రభుత్వ విద్యను కాపాడడానికి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, పేద విద్యార్థిని విద్యార్థులకు ఆసరాగా ఉండడానికి తాను నగదు బహుమతిని అందిస్తున్నానని, ఈ సంవత్సరం పదవ తరగతి పఠించే విద్యార్థినిలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు, తాను ఇచ్చే నగదు బహుమతిని కూడా పెంచుతానన్నారు.

పదవ తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 25వేల రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి 15వేల రూపాయలు, తృతీయ స్థానం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పదివేల రూపాయలు అందజేస్తానన్నారు. తాను కల్పించే ఈ ఆర్థిక ఆసరాతో మీరు పైచదువులు చదవడానికి, తల్లిదండ్రుల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. తమ సమస్యను విని వెంటనే పరిష్కరిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పోటీపడ్డారు విద్యార్థినులు. సమస్య తెలియగానే స్పందించి పరిష్కార మార్గం చూపుతూ, అధికారులను ఆదేశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి విద్యార్థుల తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కధనంపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అధికారులు స్పందిస్తూ క్రైమ్ మిర్రర్ ప్రతినిధులకు ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button