
హైదరాబాద్, (క్రైమ్ మిర్రర్) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శల జ్వాలా కక్కారు. ఏబిసిడిలు రాని వారు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులమని చెప్పుకుంటున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా సోషల్ మీడియా పట్ల విపరీతమైన అవమానంగా నిలుస్తున్నాయని రాజగోపాల్ విమర్శించారు.
ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన, “తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా తన శక్తి మేరకు పనిచేస్తూనే ఉంది. వారిని తక్కువచేసే ప్రయత్నాలు, ప్రధాన మీడియా ద్వారా వారిని ఎగతాళి చేయడం అనేది విభజించి పాలించాలనే కుట్రకు తలపెట్టిన కుటీల పన్నాగమే. సమాజం ఇలా విడగొట్టే ప్రయత్నాలను సహించదు” అంటూ ట్వీట్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌లో సీఎం వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా పాత్రికేయులను అవమానించడాన్ని తప్పుబట్టారు. సదరు వ్యాఖ్యలు తెలంగాణ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.