
వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మళ్లీ ముదురుతున్నాయి. మంత్రి కొండా సురేఖపై తిరుగుబాటు చేశారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్న కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు.
వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పరిధిలో భద్రకాళి ఆలయం ఉంటుంది. అయితే భద్రకాళి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు తెలియకుండా మంత్రి కొండా సురేఖ నిర్ణయాలు తీసుకొంటున్నారన్నది నాయిని కోపం. ఇటీవలే ఆలయంలో ఇద్దరు ధర్మకర్తలను నియమించడం ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. తన నియోజకవర్గంలోని భద్రకాళి దేవస్థానంలో, తనకు సమాచారం ఇవ్వకుండా ఇద్దరు ధర్మకర్తలు నియమిస్తూ కొండా సురేఖ ఉత్తర్వులు జారీ చేశారని టీపీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
కొండా సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదును మంత్రి కొండా సురేఖ లైట్ తీసుకొంటున్నారని తెలుస్తోంది. తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నానని.. ఆలయం ధర్మకర్తల విషయంలో ఎమ్మెల్యేకు చెప్పాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.