-
కాంగ్రెస్‌లో చేరడం నాజీవితంలో తప్పటడుగు… బిఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించండి.
-
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి
-
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
క్రైమ్ మిర్రర్, పటాన్ చెరువు: తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు చేశారు పటాన్‌చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తన జీవితంలో తీసుకున్న తప్పటడుగు అని స్పష్టంగా పేర్కొన్నారు.
మూడుసార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తనకు, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏ విధమైన రాజకీయ లాభం కూడా జరగలేదని అన్నారు. కాంగ్రెస్‌లోకి రావడం వల్ల వెంట్రుక మందం కూడా నాకు ఉపయోగం కాలేదు అంటూ వ్యాఖ్యానించడం విశేషంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే, ప్రజలంతా బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ మారినా తన రాజకీయ మూలాలు, ప్రజలతో ఉన్న అనుబంధం మారలేదన్న భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, అయోమయం నెలకొనగా, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ మార్పుల రాజకీయంలో ఆశించిన స్థానం, గుర్తింపు దక్కనప్పుడు నేతల్లో కలిగే అసంతృప్తి ఎలా బహిరంగంగా బయటపడుతుందో ఈ ఘటన ప్రతిబింబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ వచ్చిన ఈ వ్యాఖ్యలు పటాన్‌చెరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా, బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యలను రాజకీయంగా వినియోగించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.





