Mission Sudarshan Chakra: దేశ రాజధాని ఢిల్లీ రక్షణ విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పిస్తూ.. ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన వీఐపీ-89 జోన్‌లో గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘సుదర్శన్ చక్ర’ పేరిట స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఏంటీ ‘సుదర్శన్ చక్ర’?
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన ‘సుదర్శన్ చక్ర’ ఫ్రేమ్‌వర్క్ లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఈ గగనతల రక్షణ వ్యవస్థ విలువ రూ.5,181 కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పునైనా అడ్డుకునేలా బహుళ అంచెల భద్రతను ఇది అందిస్తుంది. డ్రోన్లు, క్షిపణి దాడులను ఐఏడీడబ్ల్యూఎస్ సమర్థమంతంగా తిప్పికొట్టగలదని తెలుస్తోంది.
ఎలాంటి దాడులు జరిగినా ఢిల్లీ సేఫ్
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశ రాజధాని సేఫ్ గా ఉండనుంది. శత్రుదేశాల నుంచి ఎలాంటి దాడులు జరగకుండా ఈ రక్షణ వ్యవస్థ సేఫ్ గా ఉంచనుంది. ఎలాంటి మిసైల్ దాడి జరిగిన రాజధాని ప్రాంతానికి 30 కిలో మీటర్ల దూరంలోనే దానిని ఈ వ్యవస్థ నాశనం చేయనుంది. దేశ ప్రజలతో పాటు ప్రముఖులకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా కాపాడనుంది.





