
కోదాడ, (క్రైమ్ మిర్రర్): సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్ పరిధిలో నడిగూడెం పోలీసులు నిద్ర మత్తు మాత్రల అక్రమ విక్రయంపై మెడికల్ షాప్ యజమానిని అరెస్ట్ చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో, నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 12:10 గంటలకు దాడి నిర్వహించారు.
నడిగూడెం గ్రామానికి చెందిన నకిరేకంటి బిక్షమయ్య తన సాయి మెడికల్ జనరల్ షాప్ లో నిద్ర మత్తు టాబ్లెట్లు (మొత్తం 42 సీట్లు, విలువ సుమారు రూ.3,700) ను ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి, ఖమ్మం పట్టణానికి చెందిన ఎండి షాదబ్ ఖాన్ కు విక్రయిస్తున్న సమయంలో పట్టుబడ్డాడు.
పోలీసులు నిందితుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును నడిగూడెం ఎస్సై అజయ్ కుమార్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు చేసి ఛేదించారని కోదాడ డీఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ నరసింహ ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు. నిందితులు నకిరేకంటి బిక్షమయ్య, ఎండి షాదబ్ ఖాన్ ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.