జాతీయం

ట్రాఫిక్‌ జాం ఉన్నా టోల్‌ ఎందుకు కట్టాలి, సుప్రీం సూటి ప్రశ్న!

Supreme Court: ప్రయాణికులు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడిన సందర్భాల్లో టోల్‌ ఛార్జ్ ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు నేషనల్ హైవేస్ అథారిటీని ప్రశ్నించింది. 65 కి.మీ. దూరం ప్రయాణానికి 12 గంటల సమయం తీసుకున్నప్పుడు కూడా టోల్‌ రుసుము కింద రూ.150 చెల్లించాలా? అని అడిగింది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా పలియెక్కర ట్లోల్‌ ప్లాజా వద్ద నాలుగు వారాల పాటు రుసుము వసూలు చేయకూడదని ఈ నెల 6న కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

రోడ్డు పనులు జరుగుతుండడంతో 554 నెంబరు జాతీయ రహదారిలో ఎడపల్లి- మన్నుతి మధ్య ప్రయాణం దారుణంగా మారింది. నెల రోజుల పాటు టోల్‌ రుసుము వసూలును సస్పెండ్‌ చేస్తున్నట్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలయిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. గంట ప్రయాణానికి అదనంగా 11 గంటలు తీసుకుంటే టోల్‌ రుసుము ఎందుకు చెల్లించాలని జస్టిస్‌ గవాయ్‌ ప్రశ్నించారు. NHAI తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు.  లారీ ప్రమాదానికి గురయిన కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని, ఆ ప్రమాదం ఎవరి చేతుల్లో లేదన్నారు. ఆ ప్రమాదం దైవ నిర్ణయం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రోడ్డుపై ఉన్న గుంతలో లారీ దిగబడడం వల్లనే ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిందని గుర్తు చేశారు. 11గంటల ట్రాఫిక్‌ జామ్‌లో కూడా టోల్‌ వసూలు ఏ రకంగానూ సమర్థించలేమన్నారు. ఈ మేరకు తీర్పును వాయిదా వేశారు.

Back to top button