
Medaram: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జాతర ప్రారంభమైన తొలి రోజే రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు భారీగా పాల్గొనగా, దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి దూరంగా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి కూడా ఆమె హాజరుకాకపోవడంతో, ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బుధవారం మేడారం మహా జాతర తొలి ఘట్టం ఘనంగా ముగిసింది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు మేడారం చేరుకుని సారలమ్మ గుడి వద్దకు రావడంతో జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా వన దేవతలకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంప్రదాయ పూజలు నిర్వహించి దేవతలకు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కలసి జాతర వాతావరణంలో మమేకమయ్యారు.
అయితే ఈ మహాజాతర పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, ఆ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయంగా కీలకంగా మారింది. సాధారణంగా ఇలాంటి మహా పండుగల్లో సంబంధిత శాఖ మంత్రి ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ ఈసారి అలా జరగకపోవడం వెనుక అంతర్గత రాజకీయ కారణాలున్నాయనే చర్చ మొదలైంది. ముఖ్యంగా మంత్రుల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది.
ఇటీవల మేడారం జాతర టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తన శాఖ పరిధిలో జోక్యం జరుగుతోందని ఆరోపిస్తూ కొండా సురేఖ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే మేడారం అభివృద్ధి పనులను పొంగులేటికి సంబంధించిన కంపెనీకి అప్పగించడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లు అయింది. ఈ పరిణామాలతో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
ఈ విభేదాలు ఇంకా చల్లారలేదనే విషయాన్ని జాతర సందర్భంగా జరిగిన పరిణామాలు స్పష్టంగా చూపిస్తున్నాయని పలువురు అంటున్నారు. జాతర తొలి రోజునే ఇతర మంత్రులు హాజరవుతుండగా, కొండా సురేఖ దూరంగా ఉండటం అనేది కేవలం యాదృచ్ఛికం కాదని అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత రాజకీయాలు, మంత్రుల మధ్య అధికార పోరు ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, గతంలోనే కొండా సురేఖ పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెను తొలగిస్తారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే పార్టీ లోపల అసంతృప్తి చెలరేగకుండా ఉండేందుకు, ముఖ్యంగా బీసీ నేతను తప్పించారనే విమర్శలు రావద్దన్న ఉద్దేశంతోనే హైకమాండ్ వెనక్కి తగ్గిందని అప్పట్లో రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. అందుకే పాత మంత్రులను కదిలించకుండా కొత్త వారికి అవకాశం కల్పించినట్లు ప్రచారం జరిగింది.
తాజాగా కొండా సురేఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓఎస్డీపై అవినీతి ఆరోపణలు రావడం, ఆ వ్యవహారం అరెస్టు వరకూ వెళ్లడం ఆమెకు రాజకీయంగా మరింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే, పార్టీ నేరుగా చర్యలు తీసుకోకుండా ఆమెను పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తోందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మేడారం జాతర నుంచి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఈ రాజకీయ సంకేతాలకు మరింత బలం చేకూర్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ALSO READ: Double Bonanza: సాఫ్ట్‌వేర్ జాబ్ మానేసి గ్రూప్-2 కొట్టిన భార్యాభర్తలు





