
అనకాపల్లి, క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అచ్యుతాపురం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, విదేశీయులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న భారీ కాల్ సెంటర్ ముఠాను అనకాపల్లి జిల్లా పోలీసులు ఛేదించారు. అమెరికా సహా పలు దేశాల ప్రజలకు టెక్ సపోర్ట్ మోసాలు చేస్తూ, నెలకు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ దోచుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ముఠా గత రెండు సంవత్సరాలుగా అచ్యుతాపురంలో కాల్ సెంటర్ ముసుగులో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కాల్ సెంటర్‌లో 200–250 మంది వరకు పనిచేస్తుండగా, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు దీని వెనుక ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. ఈ కాల్ సెంటర్ ఆధ్వర్యంలో విదేశీయుల డేటాను టార్గెట్ చేస్తూ, ఫిషింగ్ కాల్స్, వాయిస్ మిమిక్రీ, ఫేక్ సపోర్ట్ వాతావరణం ద్వారా నమ్మదగిన సంస్థలుగా మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
ఇప్పటివరకు 33 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ వెల్లడించగా, వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ముఠాకు సంబంధించి ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈఆపరేషన్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర సీఐడీ అధికారులు సమన్వయంతో నడుస్తున్నాయని, నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు.