మరణంలోనూ జీవం పోసిన మహానుభావురాలు
అవయవ దానంతో ఆరుగురికి పునర్జన్మ.
మర్రిగూడ(క్రైమ్, మిర్రర్): విధి ఆడిన వింత నాటకంలో ఆమె కన్నుమూసినా, తన మరణాన్ని మరో ఆరుగురి జీవితాలకు వరంగా మార్చి ఆదర్శంగా నిలిచారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ గ్రామానికి చెందిన, చెరుకు యాదమ్మ, ఇటీవల బ్రెయిన్ డెడ్‌కు గురికావడంతో, ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం, ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
వివరాల్లోకి వెళ్తే…. మర్రిగూడ గ్రామానికి చెందిన యాదమ్మ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నారు. ఆమె ఇక కోలుకోలేరని వైద్యులు ధృవీకరించడంతో, ఆ పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.
మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో, ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
యాదమ్మ శరీరం నుండి సేకరించిన కీలక అవయవాలను అవసరమైన బాధితులకు అమర్చడం ద్వారా, ఆమె ద్వారా ఆరుగురికి కొత్త జీవితం లభించింది. తమ ఇంటి మనిషి దూరమైనా, ఆమె మరొకరి రూపంలో, జీవించి ఉంటుందన్న కుటుంబ సభ్యుల ఆలోచన, సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది.
కష్టకాలంలో వారు చూపిన సాటిలేని మానవత్వం సమాజానికే ఆదర్శంగా నిలిచింది. ఒక ప్రాణం పోతూ మరో ఆరుగురికి ప్రాణదానం చేయడం అనేది, వెలకట్టలేని త్యాగమని స్థానిక ప్రజలు కొనియాడారు.
సమాజంలో అవయవ దానంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, యాదమ్మ కుటుంబం చేసిన ఈ కార్యమే, దానికి నిలువెత్తు సాక్ష్యమని పలువురు రాజకీయ నేతలు ప్రశంసించారు. ప్రాణదాత చెరుకు యాదమ్మ కుటుంబానికి, నల్లగొండ జిల్లా ప్రజలు, వైద్య వర్గాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి.
