
-
ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమైన మంత్రి సురేఖ…!
-
ఈ చిచ్చును రేవంత్ ఎలా ఆర్పుతారనేది ఆసక్తిగా మారింది
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల రోజులు సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లతో నిండిపోయాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చాయి. ఇప్పుడు వీటికి తోడు మంత్రుల మధ్య అంతర్గత ఘర్షణలు మరో కొత్త తలనొప్పిగా మారుతున్నాయి. రాష్ట్ర కేబినెట్‌లో సమన్వయం దెబ్బతింటోందని గత కొద్ది వారాలుగా వస్తున్న సంకేతాలు నిజమవుతున్నాయి. ఇంతకు ముందు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రుల మధ్య చెలరేగిన విభేదాలు చల్లారకముందే మరో వివాదం మేడారం పనుల చుట్టూ తిరుగుతోంది.
ఈసారి ప్రధాన పాత్రల్లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు రెవిన్యూ అండ్ హోసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులకై ఏడు కోట్ల రూపాయల విలువ గల టెండర్ల విషయంలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు తెలియకుండా తన మంత్రిత్వ శాఖ పరిధిలోని పనులపై మరొక మంత్రి ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదని ఆమె భావిస్తున్నారు. ఈ అంశాన్ని ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీఎం స్థాయిలో కూడా పరిష్కారం రాలేదని భావించిన సురేఖ ఇప్పుడు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఆమె ఢిల్లీ బయల్దేరి, సోమవారం పార్టీ ఉన్నతాధికారులను కలసి పొంగులేటిపై అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
Also Read : రైతులకు శుభవార్త.. అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం!
ఈ పరిణామం కేవలం మేడారం టెండర్ల చుట్టూ మాత్రమే కాకుండా, ప్రభుత్వం లోపల ఉన్న శక్తి సమతౌల్యాన్ని కూడా సూచిస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మంత్రుల మధ్య అధికార పరిమితుల స్పష్టత లేకపోవడం, ఒకరిపై మరొకరు ప్రభావం చూపాలనే ప్రయత్నాలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ కేబినెట్ ఐక్యతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ముఖ్యమంత్రితోనే పలువురు మంత్రులు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత నల్గొండ మంత్రుల మధ్య ఘర్షణ, ఆ వెంటనే పొన్నం ప్రభాకర్ – అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మధ్య బహిరంగ వాగ్వాదం పార్టీ ఇమేజ్‌కి దెబ్బతీసింది. ఆ వివాదం పీసీసీ జోక్యంతో కష్టంగా చల్లారింది. కానీ ఇప్పటి కొండా – పొంగులేటి ఘర్షణ ఆ పరిణామాలన్నింటికంటే మరింత సంక్లిష్టంగా కనిపిస్తోంది.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ టెండర్ వివాదం ప్రభుత్వ ప్రతిష్ఠకు దెబ్బతీసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వాతావరణంలో ఇలాంటి అంతర్గత ఘర్షణలు బహిర్గతమవ్వడం కాంగ్రెస్‌కి ఇబ్బందికరంగా మారనుంది. పార్టీ నాయకత్వం మాత్రం మంత్రుల మధ్య తగాదాలను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే వరుసగా పుట్టుకొస్తున్న వివాదాలు రేవంత్ నాయకత్వ సామర్థ్యంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రతిపక్షాల ఎత్తులకు సమాధానాలు చెప్పాల్సిన సమయానికే సొంత నేతల పంచాయితీలు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి ఎదురవుతున్న సవాళ్లలో ఇది మరొకటి మాత్రమే కాదు, కానీ అంతర్గత సమన్వయం కోల్పోతే రాబోయే ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రమవుతుందని పార్టీ వ్యూహకర్తలు చెబుతున్నారు. కేబినెట్‌లో చెలరేగిన ఈ చిచ్చును రేవంత్ ఎలా ఆర్పుతారనే దానిపై రాష్ట్ర రాజకీయ దృష్టి నిలిచింది.