జాతీయం

Maha Municipal Elections: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం!

మహారాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 29 మునిసిపల్‌ కార్పొరేషన్లకుగాను 25 కార్పొరేషన్లను దక్కించుకుంది.

మహారాష్ట్ర మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలోని 29 మునిసిపల్‌ కార్పొరేషన్లకుగాను 25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన బృహన్‌ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండి కొట్టింది. గత 25 ఏళ్లుగా ఉమ్మడి శివసేననే ఇక్కడ అధికారం చెలాయిస్తూ వచ్చింది. తాజా ఫలితాల్లో ఇక్కడ సొంతంగా మెజారిటీ సాధించకపోయినా, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ముంబైలో బీజేపీ 88 వార్డుల్లో విజయం

ముంబైలో బీజేపీ 88 వార్డులు గెలిచింది. రెండోస్థానంలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నిలిచింది. ఈ పార్టీ 67 చోట్ల విజయం సాధించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన 28 వార్డులు గెలిచి మూడో పెద్దపార్టీగా నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ 24, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) 6, ఎన్సీపీ 3, ఎన్సీపీ (ఎస్‌పీ) 1 చోట, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్‌ అయిన బీఎంసీలో 227 వార్డులు ఉన్నాయి. మెజారిటీ మార్కు 114. బీజేపీ, శివసే, ఎన్సీపీలకు వచ్చిన సీట్లు కలిపితే మెజారిటీ మార్కు లభిస్తుంది.అటు మిగిలిన మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ ఎక్కువశాతం మహాయుతి కూటమే గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 2,869 వార్డులు ఉండగా, బీజేపీ 1,440, శివసేన 404, కాంగ్రెస్‌ 318, శివసేన (యూబీటీ) 156, ఎన్సీపీ 164, ఎన్సీపీ (ఎస్పీ) 36, ఎంఎన్‌ఎస్ 14, వీబీఏ 15, ఇతరులు 322 చోట్ల గెలిచారు.

ప్రధాని మోడీ హర్షం

మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ప్రధానిమోడీ హర్షం వ్యక్తంచేశారు. ఈ ఫలితాలే కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ పనితీరుకు దక్కిన మద్దుతు అని అన్నారు. అటు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై బీఎంసీలో ప్రచారం చేసిన మూడు చోట్ల బీజేపీ విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button