మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు భర్త, అత్త, మామ, ఆడపడుచు. శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేశారు కుటుంబసభ్యులు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి ఆవరణలో వివాహిత నాగమణిని (35)కి హత మార్చి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు కుటుంబం సభ్యులు. ఆమె భర్త, అత్త, మామ, ఆడపడుచు కలిసి కిరాతకంగా చంపేశారు.ఆమెను పాతిపెట్టిన స్థలంలో కట్టెల పొయ్యి పెట్టి సంక్రాంతి పండగ కోసం పిండి వంటలు చేసుకుని తిన్నారు కిరాతకులు.
ఇంటి నుంచి వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా నాగమణిని కిరాతంగా చంపేశారని గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట తవ్వగా నాగమణి మృతదేహం బయటపడింది. ఇంటికి తాళం వేసి పరారయ్యారు మృతురాలి భర్త గోపి. అత్త లక్ష్మి, మామ రాములు, ఆడపడుచు దుర్, ఆమె భర్త మహేందర్ పరారిలో ఉన్నారు. మృతి చెందిన నాగమణి కి ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.