మహా కుంభమేళా ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా తెల్లవారుజామున ఆరంభమైంది. లక్షలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ మహాకుంభ మేళా మొత్తం 45 రోజుల పాటు సాగనుంది. పుష్య పౌర్ణమి ని పురస్కరించుకుని తొలిపుణ్యస్నానంతో ఈ మహా క్రతువుకు యూపీ సర్కారు శ్రీకారం చుట్టింది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా యోగి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది.
గంగ, యమునలతోపాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో మహా కుంభమేళా జాతార కొనసాగుతోంది. మహా కుంభమేళాకు రెండు రోజుల ముందే స్నానాల సందడి ప్రారంభమయ్యింది. శనివారం 25 లక్షల మంది, ఆదివారం లక్ష మంది వరకూ పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
మహాకుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్‌ను అందంగా ముస్తాబయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. 10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. 1,250 కిలోమీటర్ల పైపులైన్లతో 50 వేల నీటి కనెక్షన్లు ఇచ్చారు. 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను, 30 బల్లకట్టు వంతెనలను నిర్మించారు. పారిశుద్ధ్య నిర్వహణకు 15 వేల మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు.
మహా కుంభ్‌నగర్ ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది. ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. భక్తుల భద్రతకు యూపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. పటిష్ఠ నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. ఏఐ సహకారంతో కెమెరాల ద్వారా నిఘాకు చర్యలు చేపట్టింది. 55 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45 వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామాజిక మాధ్యమాలపై కూడా నిరంతరం నిఘా ఉంచనున్నారు.
భక్తుల భద్రత కోసం 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను మోహరించారు. నీటిలో మునిగి నిఘా ఉంచే డ్రోన్లు, కంట్రోల్ సెంటర్‌తో పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న వివిధ కార్యాలయాల గోడలపై దేవతామూర్తుల చిత్రాలను వేశారు. రద్దీ నిర్వహణ కోసం వివిధ క్రాస్‌రోడ్స్, ట్రై జంక్షన్స్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారాల వద్ద భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి కుంభమేళా కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 13న పుష్యపౌర్ణమి, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, 26న మహా శివరాత్రి సందర్భంగా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.