క్రైమ్

బతికి ఉండాలంటే రూ. 500 కోట్లు ఇవ్వాలి, మహిళా జడ్జికి బెదిరింపులు!

Lady Judge Gets Threat: ఇప్పటి వరకు జనాలను బెదిరించిన బందిపోట్లు ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తులనే బెదిరిస్తున్నారు. బతికి ఉండాలంటే  రూ.500 కోట్లు ఇవ్వాలని ఏకంగా మహిళా జడ్జికే బెదిరింపు లేఖ పంపండం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బందిపోటు నాయకుడు హనుమాన్‌ ముఠా సభ్యుడి పేరుతో అందిన స్పీడ్‌ పోస్ట్‌ కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

సివిల్ జడ్జి మోహినీకి బెదిరింపు లేఖ  

తియోంథార్‌ లోని మొదటి సివిల్ జడ్జి మోహినీ భడోరియాకు తాజాగా స్పీడ్‌ పోస్ట్‌ అందింది. ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్ నుంచి పంపిన అందులో బెదిరింపు లేఖ ఉన్నది. “నువ్వు బతికి ఉండాలనుకుంటే రూ.500 కోట్లు చెల్లించాలి. సెప్టెంబర్ 1న సాయంత్రం 7:45 గంటలకు ఉత్తరప్రదేశ్‌ లోని బద్‌ గడ్ అడవిలో ఆ డబ్బు అందజేయాలి. దీనిని విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని ఆ లేఖలో హెచ్చరించారు. గతంలో మధ్య భారత్‌ను ఠారెత్తించిన చంబల్‌ బందిపోటు నాయకుడు హనుమాన్ ముఠా సభ్యుడి సంతకం ఆ లేఖలో ఉన్నది. జడ్జీకి అందిన ఈ బెదిరింపు లేఖ కోర్టులో కలకలం రేపింది. ఇది చూసి న్యాయమూర్తి మోహినీ భడోరియా షాకయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ వెంటనే స్పందించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్ జిల్లాకు చెందిన ఒక అనుమానితుడిని గుర్తించారు. అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు పోలీస్‌ బృందాలను పంపారు. అలాగే రేవాలోని కోర్టులు, న్యాయమూర్తుల భద్రతను కట్టుదిట్టం చేశారు.

Back to top button