క్రైమ్

కారులో నిప్పు అంటించుకుని ప్రేమ జంట ఆత్మహత్య..మేడ్చల్ లో విషాదం

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. కారులో కూర్చుని.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు లవర్స్. ఇద్దరు అక్కడే తగలబడిపోయారు. వేర్వేరు కులాలకు చెందిన తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని ఆందోళన.. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ ఓ పోకిరీ బ్లాక్‌మెయిలింగ్‌ నేపథ్యంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు కుటుంబం 20 ఏళ్ల క్రితం బీబీనగర్‌ మండలం జమిలాపేట్‌కు వచ్చింది. ఆంజనేయులు కుమారుడు శ్రీరాములు ఘట్‌కేసర్‌ మండలం నారపల్లిలో హోల్‌సేల్‌ సైకిల్‌ షాప్ నిర్వహిస్తున్నాడు. నారపల్లికి చెందిన 17 ఏళ్ల బాలిక శ్రీరాములును ప్రేమించింది. ప్రేమ వ్యవహారం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు మందలించి ఆమెను కొట్టారు. అయినా ప్రేమికులు కలుస్తూనే ఉండేవారు. ఈ క్రమంలో బాలిక సమీప బంధువు చింటూ వీరి ప్రేమ గురించి తెలుసుకుని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. తనకు డబ్బులివ్వాలని.. లేకపోతే తల్లిదండ్రులకు చెబుతానంటూ బెదిరించేవాడు. భయపడ్డ శ్రీరాములు పలుదఫాలుగా లక్షా 35 వేలు ఇచ్చాడు. మరింత డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి పెరిగిపోవడం.. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

శ్రీరాములు మేడిపల్లిలోని ఓ సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి కారులో ఘట్‌కేసర్‌ ఠాణా పరిధి ఘన్‌పూర్‌లోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కన కారు ఆపారు. వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నారు. కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకొచ్చి గట్టిగా హాహాకారాలు చేస్తూ ఫుట్‌పాత్‌ మీద పడి మృతి చెందాడు. బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం ఏ మాత్రం గుర్తించలేనంతగా కాలిపోయింది.

అటుగా వెళ్తున్న వాహనదారులు కొందరు గుర్తించి పోలీసులు, అగ్నిమాపకశాఖకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపు కారు, అందులోని బాలిక మృతదేహం పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫ్‌డ్రైవ్‌ సంస్థ ప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని.. శ్రీరాములు కారు అద్దెకు తీసుకున్న వివరాలు పోలీసులకు చెప్పారు. అందులో ఉన్న సెల్‌ఫోన్‌ నంబరు ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొన్నిరోజుల క్రితం తమ అబ్బాయి ప్రేమ విషయం తమతో చెప్పాడని, ఘటనకు కొన్ని నిమిషాల ముందు ఆత్మహత్య లేఖను తమకు పంపాడంటూ ఓ లేఖను శ్రీరాములు తల్లిదండ్రులు చూపించారు. పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కారులోని నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు.. ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు బ్లాక్‌మెయిలర్‌ చింటూ నివాసంపై దాడికి దిగారు. ఆ సమయంలో చింటూ లేకపోవడంతో అతని తండ్రిని కొట్టారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button