
బెంగళూరు నగరానికి గుర్తింపైన ప్రాచీన దేవాలయాలలో హలసూరు శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం ఒక ముఖ్యమైన స్థానం సంపాదించింది. చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ఈ పవిత్ర క్షేత్రంలో ఎన్నో దశాబ్దాల పాటు వివాహ వేడుకలు జరుగుతూ వచ్చాయి. అయితే గత 7 సంవత్సరాలుగా ఈ ఆలయంలో పెళ్లిళ్లను పూర్తిగా నిలిపివేయడం భక్తులలో ఆశ్చర్యం కలిగించడంతో పాటు చర్చానీయాంశంగా మారింది. ఇటీవల ఆలయ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఈ నిర్ణయానికి వెనుక ఉన్న అసలు కారణాలను స్పష్టం చేసింది. ఆలయం పవిత్రతకు భంగం కలగకుండా, పూజారులు న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
సోమేశ్వరస్వామి ఆలయం చరిత్రను పరిశీలిస్తే.. దాని మూలాలు 12వ శతాబ్దం వరకు వెళ్లి చేరుతాయి. చోళులు, విజయనగర సామ్రాజ్యపు కళాశైలులు స్పష్టంగా కనిపించే ఈ ఆలయం ద్రవిడ నిర్మాణ కళకు అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. బెంగళూరును నిర్మించినది కెంపేగౌడ అని మనకు తెలుసు. ఆయనే ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల కాలం నాటిది కావడం, దాని పురాతనత, పవిత్రత మరింత ప్రత్యేకతను తీసుకువస్తాయి. ఇటువంటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆలయంలో వివాహాలను ఆపివేయడం సహజంగానే భక్తులలో ప్రశ్నలను రేకెత్తించింది.
వివాహాలు నిలిపివేయడానికి మతపరమైన కారణం ఉందేమోనని చాలామంది భావించినప్పటికీ, ఆలయ నిర్వహణ బోర్డు తెలిపిన వివరాలు మాత్రం పూర్తిగా వేరే దిశలో ఉన్నాయి. ఆలయంలో వివాహం చేసుకున్న కొన్ని జంటలు తరువాత విభేదాల కారణంగా విడాకుల కోసం కోర్టులకు వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ కేసుల విచారణ సమయంలో పూజారులను సాక్షులుగా కోర్టులకు పిలవడం, హజరు కావాలని ఆదేశించడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అలాంటి సన్నివేశాలు పూజారులపై అనవసర ఒత్తిడిని పెంచి, వారి దైనందిన దేవాలయ సేవలకు అంతరాయం కలిగించాయని యాజమాన్యం వెల్లడించింది.
ఈ విషయాలన్నింటినీ పరిశీలించిన అనంతరం, భవిష్యత్తులో ఇటువంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు, అలాగే ఆలయ పవిత్రతను కాపాడేందుకు పెళ్లిళ్లను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. గత 6 నుండి 7 సంవత్సరాలుగా ఈ నిర్ణయాన్ని మౌఖిక ఆదేశాల రూపంలో అమలు చేస్తూ వచ్చారని, తాజాగా ఈ వివరాలను అధికారికంగా ప్రభుత్వానికి పంపినట్లు ఆలయ ఈవో తెలిపారు. వివాహాల కోసం వచ్చే మనుషుల గందరగోళంతో ఆలయం ప్రశాంతత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కూడిన ఈ నిర్ణయం, పవిత్ర స్థానాల ప్రతిష్టను కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యగా పేర్కొన్నారు.
ఈ నిర్ణయం తర్వాత కూడా భక్తులు ఆలయంలోని ఇతర పూజలు, కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. పూజారులు తమ సేవలను మరింత భక్తిశ్రద్ధలతో కొనసాగించే అవకాశం ఏర్పడిందని యాజమాన్యం భావిస్తోంది. ఆలయ పరిరక్షణ, సంప్రదాయ రక్షణ, పూజా విధానాల పవిత్రత అనే మూడు ముఖ్య లక్ష్యాలను ముందుంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం విస్తృత చర్చకు కారణమైంది.
ALSO READ: Rashmika Mandanna: వైట్ డ్రెస్‌లో మెరిసి, మతి పోగొట్టేసిన హీరోయిన్





