
Love Harassment: సాధారణంగా ప్రేమ పేరుతో అమ్మాయిలను యువకులు వేధిస్తున్న ఘటనలే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ ఘటన పూర్తిగా భిన్నం. ప్రేమించాలని కోరుతూ ఓ మహిళ ఏకంగా ఓ పోలీస్ అధికారినే ట్రాప్ చేసి తీవ్రంగా వేధించిన సంఘటన ఇప్పుడు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు, రాజకీయ పలుకుబడి పేరుతో ఒత్తిళ్లు, చివరకు రక్తంతో ప్రేమలేఖ రాసే వరకు వెళ్లిన ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.
బెంగళూరులోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో జీజే. సతీశ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. గత అక్టోబర్ 30న ఆయనకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ యువతి ఫోన్ చేసింది. తాను రామమూర్తి నగర్‌లో నివసిస్తున్న సంజన అలియాస్ వనజగా పరిచయం చేసుకున్న ఆమె.. ఇన్‌స్పెక్టర్ సతీశ్‌ను ప్రేమిస్తున్నానని చెప్పింది. అంతేకాదు, ఆయన కూడా తనను ప్రేమిస్తున్నానని చెప్పాలని పట్టుబట్టింది. తొలుత దీన్ని సరదా కాల్‌గా భావించిన సతీశ్ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత పదే పదే కొత్త నంబర్ల నుంచి కాల్స్ రావడంతో వాటన్నింటినీ బ్లాక్ చేయడం ప్రారంభించారు.
అయినా వేధింపులు ఆగలేదు. ఈసారి యువతి మరో మార్గాన్ని ఎంచుకుంది. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకుంటూ, సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పింది. కొందరు రాజకీయ నేతలతో దిగిన ఫొటోలు పంపించి, తన ప్రేమను అంగీకరించాలని ఒత్తిడి తెచ్చింది. స్పందించకపోతే రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తానని బెదిరింపులకు దిగింది. ఒక దశలో హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి ఇన్‌స్పెక్టర్ సతీశ్‌కు కాల్ వచ్చేలా కూడా చేసింది. ఆ యువతి ఫిర్యాదును ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించగా, ఆమె ఎప్పుడూ స్టేషన్‌కు రాలేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని సతీశ్ స్పష్టం చేశారు.
ఇన్‌స్పెక్టర్ స్టేషన్‌లో లేని సమయంలో ఒకసారి స్టేషన్‌కు వెళ్లిన యువతి.. తాను సతీశ్‌కు బంధువునని చెప్పి ఆయన కార్యాలయంలో పూల బొకే, స్వీట్ బాక్స్ పెట్టి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి వేధింపులు ప్రారంభించింది. ఇలాంటి చర్యలు చేయొద్దని హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 2025 నవంబర్ 7న ఇన్‌స్పెక్టర్ సతీశ్ ప్రజా ఫిర్యాదులు పరిశీలిస్తున్న సమయంలో ఆమె కార్యాలయంలోకి వెళ్లి ఓ కవర్ అందజేసింది. అందులో నెక్సిటో ప్లస్ అనే 20 మాత్రలు, అలాగే తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులతో కూడిన లేఖ ఉన్నట్లు తెలిసింది. తన చావుకు సతీశే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ లేఖలో రాసింది. అంతేకాదు, హార్ట్ గుర్తుతో పాటు చిన్నీ లవ్ యూ, యు లవ్ మీ అని తన రక్తంతో రాశానని పేర్కొనడం తీవ్ర కలకలం రేపింది.
ఈ నిరంతర వేధింపులు భరించలేక ఇన్‌స్పెక్టర్ సతీశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆమె ఇతర పోలీస్ సిబ్బందిని ఇదే తరహాలో వేధించినట్లు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ కోసం ఆమె ఇంటికి వెళ్లినా, ఆమె సహకరించలేదు. కుటుంబ సభ్యుల వివరాలు చెప్పేందుకు కూడా నిరాకరించింది. ఈ నెల 12న మరోసారి స్టేషన్‌కు వచ్చి రచ్చ చేసింది. తన ప్రేమను అంగీకరించకపోతే సూసైడ్ చేసుకుంటానని గట్టిగా అరవడమే కాకుండా, ఇన్‌స్పెక్టర్ ప్రతిష్ఠను దెబ్బతీస్తానని బెదిరించింది.
చివరకు ఆమె నిరంతర వేధింపులు, విధులకు ఆటంకం కలిగించడం, ఆత్మహత్య బెదిరింపుల నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ సతీశ్ మరోసారి అధికారికంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మహిళపై క్రిమినల్ బెదిరింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించే ప్రయత్నం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ పేరుతో హద్దులు దాటిన ఈ ఘటన ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: Viral Video: నిధి అగర్వాల్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్





