Love Beyond Death: ప్రేమంటే.. భౌతికంగా కలిసి ఉండటమే కాదు, వారు లేకపోయినా జ్ఞాపకాల్లో జీవించడం అని నిరూపించింది ఓ యువతి. చనిపోయిన ప్రియుడిని పెళ్లి చేసుకుని అందరినీ కంటతడి పెట్టింది. మహారాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన ప్రియుడిని కుటుంబసభ్యులే దారుణంగా హత్య చేసినప్పటికీ ఆ 21 ఏళ్ల యువతి.. ప్రాణం పోయినా అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని వివాహమాడింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నాందేడ్‌కు చెందిన ఆంచల్ మామిడ్వార్ తన సోదరుడి స్నేహితుడైన సాక్షమ్ తాతేతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి బతకాలని కలలుకన్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో ఆంచల్ తండ్రి, ఇద్దరు సోదరులు ఈ బంధాన్ని వ్యతిరేకించారు. ఆంచల్ కుటుంబం నుంచి తీవ్ర బెదిరింపులు ఉన్నా, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వేరే కులం వాడి ని పెళ్లి చేసుకుంటే పరువుపోతుందని భావించిన ఆంచల్ కుటుంబ సభ్యులు.. సాక్షమ్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆంచల్ తండ్రి గజానన్, ఇద్దరు సోదరులు సాహిల్, హిమేశ్ మరో ఇద్దరితో కలిసి సాక్షమ్‌పై దాడి చేశారు. తుపాకీతో కాల్చి దారుణంగా చంపేశారు. విషయం తెలుసుకున్న ఆంచల్ గుండెలవిసేలా ఏడ్చింది.
చనిపోయిన ప్రియుడితో వివాహం
అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆంచల్.. సాక్షమ్ ఇంటికి చేరుకుంది. ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని.. తన ప్రేమకు చావు లేదని చెప్పాలనుకుంది. చనిపోయినా, బతికున్నా అతడే తన భర్త అంటూ.. ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి, తన నుదుటిపై సిందూరం దిద్దుకుని.. జీవితాంతం సాక్షమ్ భార్యగా అతడి ఇంట్లోనే బతుకుతానని చెప్పింది. ప్రస్తుతం ఈ ఘటన మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది.





