తెలంగాణ

కాళేశ్వరం ఈఈ ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు, విలువ ఎన్ని కోట్లంటే?

Kaleshwaram EE Sridhar Arrest: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ ను ఏసీబీ అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతడిని అదుపులోకి తీసుకుని.. కోర్టుకు తరలించారు. ఆయనకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.

రూ. 200 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

అంతకు ముందుకు ఈఈ నూనె శ్రీధర్ ఇళ్లతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.200 కోట్లకు పైగా ఆయనకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. శ్రీధర్ నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. శ్రీధర్ విలువైన ఆస్తులు, భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారం, ప్లాటినం ఆభరణాలు, వజ్రాలు, కార్లు, విల్లాలను గుర్తించారు. అధికారుల తనిఖీల్లో తెల్లాపూర్‌ లో విల్లా, షేక్‌ పేటలో ప్లాట్‌, కరీంనగర్‌ లో 3 ఓపెన్‌ ప్లాట్లు, అమీర్‌ పేటలో కమర్షియల్ కంప్లెక్స్, హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 3 ఇండిపెండెంట్‌ హౌస్‌ లు, అతని పేరిట 16 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో 19 ఓపెన్‌ ప్లాట్‌లు తేలింది. అటు బ్యాంకు లాకర్లలో బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు.

బ్యాంకు లాకర్లలో నగలు, నగదు

శ్రీధర్‌ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీధర్‌ ఎస్‌ఆర్‌ఎస్పీ డివిజన్‌ 8లో ఈఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీ పనులను పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

Read Also: ఆధారాలు లేని అభియోగాలు వద్దు, మంగ్లీ ఎమోషనల్ కామెంట్స్!

Back to top button