Vande Mataram Special Discussion: వందేమాతర గీతంపై ఇవాళ లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుపనున్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకను ఏడాది పాటు నిర్వహించుకోవడంలో భాగంగా ఈ చర్చ చేపట్టనున్నారు. ఈ జాతీయ గేయం గురించి ఇప్పటివరకు వెలుగులోకి రాని పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు లెలుస్తోంది.
లోక్ సభలో మోడీ, రాజ్యసభలో అమిత్ షా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో వందేమాతరంపై చర్చను ప్రారంభించనున్నారు. అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. ఎన్డీయే పక్షాలకు లోక్‌సభలో 3 గంటలు కేటాయించగా, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఉపనేత గౌరవ్ గగోయ్, ప్రియాంకా గాంధీ వాద్రా సహా 8 మంది నేతలు మాట్లాడనున్నారు. అటు, మంగళవారం రాజ్యసభలో హోంమంత్రి అమిత్‌షా ఈ అంశంపై చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు ప్రసంగిస్తారు.
వందేభారత్ గీతం గురించి..
బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతాన్ని 1875 నవంబరు 7న తొలిసారిగా లిటరరీ జర్నల్ బంగదర్శన్‌లో ప్రచురించారు. అనంతరం 1882లో ప్రచురితమైన తన నవల ఆనందమఠ్ లో బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని పొందుపర్చారు. వందేమాతర గీతం 150 సంవత్సరాల ఉత్సవాన్ని ఏడాదిపాటు నిర్వహించుకునే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ గతనెల 7న ఢిల్లీలో ప్రారంభించారు. ఏడాదిపాటు విద్యార్థులు, యువతలో జాతీయ గీతంపై అవగాహనను పెంపొందించనున్నారు. 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్ తొలగించిందని, తద్వారా దేశ విభజనకు బీజాలు నాటిందని ప్రధాని మోడీ ఆరోపించారు.
‘సర్’పై లోక్ సభలో కీలక చర్చ
అటు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సహా ఎన్నికల సంస్కరణలపై మంగళవారం నుంచి పార్లమెంటులో చర్చించనున్నారు. లోక్ సభలో మంగళ, బుధవారాలు, రాజ్యసభలో బుధ, గురువారాలు ఎన్నికల సంస్కరణలపై చర్చిస్తారు. కాంగ్రెస్ నుంచి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు, రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడనున్నారు.





