VB-G RAM G Bill Pass: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘వీబీ జీరామ్‌జీ’ బిల్లు ఆమోదం పొందింది. ఎనిమిది గంటల చర్చ అనంతరం, విపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు తీసుకొచ్చిన ఈ చట్టంలోని లోపాలను సవరించేందుకే ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నప్పుడు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బిల్లు కాపీలను చించేస్తున్న విపక్ష ఎంపీలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహాత్ముడి ఆదర్శాలను పలుమార్లు హత్య చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకుంటోందని చౌహాన్ దుయ్యబట్టారు.
మహాత్ముడి ఆశయాలను కాంగ్రెస్ హత్య చేసింది!
సభలో ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యుల తీరు అవమానకరంగా ఉందని, వారు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యంగా, గూండాగిరీగా మార్చేశారని చౌహాన్ నిప్పులు చెరిగారు. విపక్ష సభ్యులు పేరు మార్పుపై దృష్టి సారిస్తే.. తాము అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి హామీ పథకం అవినీతితో నిండిపోయిందని.. రాష్ట్రాలు ఆశించినట్టుగా నిధులను కేటాయించలేదని ఆరోపించారు.
ఓట్ల కోసమే గాంధీ పేరు!
ఉపాధి హామీ చట్టానికి వారు తొలుత మహాత్మాగాంధీ పేరే పెట్టలేదని.. కేవలం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ అని మాత్రమే పెట్టారని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. 2009లో సార్వత్రిక ఎన్నికలప్పుడు.. ఓట్లు పొందడానికి కాంగ్రెస్ పార్టీ బాపూజీని గుర్తుచేసుకుందని దుయ్యబట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం 100 రోజులున్న ఉపాధి రోజులను తాము ఈ బిల్లుతో 125 రోజులకు పెంచామని.. ఇందుకోసం అదనంగా రూ.1,51,282 కోట్లను ప్రతిపాదించామని మంత్రి వివరించారు. అందులో రూ.95 వేల కోట్లు కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ కొత్త పథకం ద్వారా ఒకవైపు ప్రజలకు ఉపాధి కల్పిస్తూనే.. మరోవైపు పూర్తి గ్రామాన్ని, అభివృద్ధి చెందిన గ్రామాన్ని, అందరికీ ఉపాధి ఉన్న గ్రామాన్ని, పేదరికంలేని గ్రామాన్ని నిర్మిస్తామన్నారు. అటు ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగిస్తూ తెచ్చిన జీరామ్‌జీ బిల్లును వ్యతిరేకిస్తూ పలువురు విపక్ష ఎంపీలు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో నిరసన ప్రదర్శన చేశారు.





