క్రైమ్జాతీయం

High Court: సమాజానికి నచ్చనంత మాత్రాన చట్ట వ్యతిరేకం కాదు, సహజీవనంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

సహజీవనంపై హైకోర్టు రెండు తీర్పులు వెలువరించింది. వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది.

High Court On Live in Relationship: సహజీవనంపై అలహాబాద్‌ హైకోర్టు రెండు కీలక తీర్పులు వెలువరించింది. వివాహం కాని మేజర్లు కలిసి జీవిస్తే అది చట్ట వ్యతిరేకం కాదని, విడాకులు తీసుకోకుండా వివాహితులు అదే పని చేస్తే నేరంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. సహజీవనం చేస్తున్న 12 మంది అవివాహిత మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించగా, మరో జంటకు మాత్రం ఆ సౌకర్యాన్ని నిరాకరించింది. ఈ సందర్భంగా సహజీవనం పరిధులను నిర్ణయిస్తూ జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ సింగ్‌ ధర్మాసనం వేరువేరు తీర్పులు ఇచ్చింది. సహజీవనం చేస్తున్న తమను కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదంటూ 12 మంది మహిళలు విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి విచారణ జరిపారు. వారికి భద్రత కల్పించాలని ఆయా జిల్లాల పోలీసు అధికారులను ఆదేశిస్తూ సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సమాజానికి నచ్చనంత మాత్రాన చట్టవ్యతిరేకం కాదు!

అందరికీ నచ్చనంత మాత్రాన సహజీవనాన్ని చట్టవ్యతిరేకమైనదిగా భావించలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.   ‘‘వారు మేజర్లు. వివాహం చేసుకోకుండానే కలిసి జీవించాలని అనుకుంటున్నారు. వారి నిర్ణయంపై తీర్పు చెప్పడం కోర్టుల పని కాదు’’ అని తెలిపారు. సహజీవనాలను సమాజం ఆమోదించకపోగా, నేరంగా పరిగణిస్తుందన్న విషయాన్ని న్యాయమూర్తి అంగీకరించారు. ‘‘అయితే పాశ్చాత్య భావాలను స్వాగతించడానికి భారత దేశం ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటుంది. సహజీనవనం కూడా అలాంటి భావజాలమే. ఇది కొందరికి ఇది అనైతికత ప్రవర్తన. మరికొందరికి మాత్రం అనుకూల జీవనానికి ఆమోదయోగ్యమైన మార్గం’’ అని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

విడాకులు ఇవ్వకుండా సహజీవనం కుదరదు!

అటు మరో కేసులో ఇదే న్యాయమూర్తి తీర్పు చెబుతూ విడాకులు తీసుకోకుండా వివాహితులు సహజీవనం చేస్తే అది చట్ట వ్యతిరేకమవుతుందని తెలిపారు. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ సహజీవనం చేస్తున్న ఓ జంట చేసిన వినతిని తిరస్కరించారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా సహజీవనం చేయడం కుదరదని, అలాంటి పరిస్థితుల్లో పోలీసు రక్షణ కల్పించలేమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button