- జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
మాడ్గులపల్లి ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): సమాజ హితం కోసం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించే జర్నలిస్టుల భద్రత అత్యంత కీలకమని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు.
బుధవారం జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన, ప్రత్యేక కార్యక్రమంలో ఆయన జర్నలిస్టులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య ప్రత్యేక చొరవతో, స్థానిక సర్పంచులు అరూరి నరేష్ (మాడుగులపల్లి), అండం రేణుక యాదయ్య (చిరుమర్తి)ల ఆర్థిక సహకారంతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, జర్నలిస్టుల వృత్తిపరమైన సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వార్తల సేకరణలో భాగంగా జర్నలిస్టులు సమయపాలన లేకుండా, ఎండనక వాననక ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రాంతాలు ప్రయాణిస్తుంటారని, ఈ క్రమంలో జరిగే అవాంఛనీయ రోడ్డు ప్రమాదాల వల్ల, ఎందరో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హెల్మెట్ ధరించడం అనేది కేవలం బాధ్యతలు కోసం కాదు, అది మీ కుటుంబం కోసమని ఆయన హితవు పలికారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తే 90 శాతం ప్రాణాపాయం నుంచి, తప్పుకోవచ్చని గుర్తు చేశారు.
తన పరిధిలోని పాత్రికేయుల క్షేమం కోసం వినూత్నంగా, ఆలోచించిన ఎస్సై కృష్ణయ్య పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, వివిధ పత్రికల, ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన ఎస్పీకి, స్థానిక పోలీసులకు, దాతలకు మీడియా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టులు తమ కలం ద్వారా సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా, స్వీయ రక్షణలోనూ అప్రమత్తంగా ఉండాలని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. జర్నలిస్టులు సమాజానికి రోల్ మోడల్‌గా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను స్వయంగా పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
పోలీస్ శాఖ పిలుపు మేరకు సామాజిక బాధ్యతతో స్పందించి, జర్నలిస్టుల భద్రత కోసం ఆర్థిక సహకారం అందించిన, సర్పంచులు అరూరి నరేష్, అండం రేణుక యాదయ్యలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

