
క్రైమ్ ది మిర్రర్(మార్చి 17), మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:- జీవితం జీవించడానికేనని ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురై నప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని పోలీస్ బాస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ పిలుపునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాదు లో ఆత్మహత్యల నివారణ కమిటీ మరియు సైకాలజిస్ట్ ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో పోలీసుల కు చేపట్టబోయే ఆత్మహత్యల నివారణ సదస్సుల కరపత్రాలు మరియు బ్రోచర్లను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల, సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలని, తనకి ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో భరోసా నింపాలని, కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందని, ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని తెలిపారు. గత పది సంవత్సరాలుగా సైకాలజిస్ట్ డాక్టర్ అశోక్ పరికిపండ్ల ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ యస్.పి. రమణబాబు, పోచం అశోక్ తదితరులు పాల్గొన్నారు.