
Life happiness study: డబ్బు సంతోషాన్ని ఇస్తుంది అనే మాటలో నిజం ఉన్నా.. ఆ డబ్బును ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తున్నామన్నది మన ఆనందాన్ని ఎంతకాలం నిలుపుతుందో నిర్ణయిస్తుంది అని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ చేసిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. కొత్త వస్తువులు కొనడం తాత్కాలిక సంతోషాన్నే ఇస్తుందని ఈ పరిశోధన చెబుతుంది. కానీ అందమైన ప్రదేశాలు సందర్శించడం, ప్రయాణాలు చేయడం, ఈవెంట్లకు హాజరుకావడం వంటి అనుభవాలపై డబ్బు ఖర్చు చేస్తే మనసులో ఎక్కువ రోజులు నిలిచిపోయే ఆనందం లభిస్తుందని అధ్యయనం తెలియజేస్తోంది.
అమెరికాలోని 12000 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించిన ఈ అధ్యయనంలో, వారిలో 94 శాతం మంది వస్తువుల కొనుగోలు నిజమైన సంతోషాన్ని ఇవ్వదని అంగీకరించారు. కొత్త ఫోన్, కొత్త బట్టలు, గాడ్జెట్స్ కొనుగోలు చేసినప్పుడు ఆ క్షణంలో ఆనందం కలిగినా, ఆ సంతోషం త్వరగానే తగ్గిపోతుందని తెలిపారు. కానీ ప్రయాణాలు, సంగీత కార్యక్రమాలు, స్నేహితులతో కలిసి భోజనం చేయడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలను చూడడం వంటి అనుభవాలు మాత్రం ఎంతో కాలం మధుర జ్ఞాపకాలుగా నిలుస్తాయని, వాటిలో వచ్చిన ఆనందం మరింత లోతైనదని చెప్పారు.
ఈ అనుభవాలు కేవలం సంతోషాన్నే ఇవ్వవు, మన వ్యక్తిత్వాన్ని కూడా బలపరుస్తాయని, మనలోని కొత్త కోణాలను బయటకు తీసుకువస్తాయని నిపుణులు పేర్కొన్నారు. పైగా, అనుభవాల కోసం ఖర్చు పెట్టడం ఇతరులతో అనుబంధాన్ని పెంచే శక్తిని కలిగి ఉందని, మన హృదయంలో వేడుకలుగా, జ్ఞాపకాలుగా నిలిచిపోతుందని సూచించారు. డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తే అది మన అనుభవాలను సమృద్ధిగా మార్చి, జీవితాన్ని మరింత సార్థకంగా మార్చగలదని ఈ పరిశోధన చెప్పింది.
ALSO READ: Lifestyle: ఆరోగ్యమే ఫస్ట్.. ఎంజాయ్‌మెంట్ నెక్ట్స్





