Homeఆంధ్ర ప్రదేశ్ఊరి బడిని కాపాడుకుందాం...!

ఊరి బడిని కాపాడుకుందాం…!

  • యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ పిలుపు

బద్వేలు , క్రైమ్ మిర్ర‌ర్‌: పేదలకు నాణ్యమైన ప్రభుత్వ విద్య అందాలంటే ఊరి బడిని కాపాడుకోవాల్సిందేనని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ పేర్కొన్నారు. పోరుమామిళ్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ప్రభుత్వ బడిలోనే విద్యార్థులను చేర్పిద్దాం-ఊరి బడిని కాపాడుకుందాం” అనే నినాదంతో యుటిఎఫ్ పోరుమామిళ్ల మండల అధ్యక్షులు బి.ఈశ్వరరావు అధ్యక్షతన ప్రాంతీయ సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా మాదన విజయ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడుతూ, అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు నేడు పాలకుల విధానాల ఫలితంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యంగా హామీలిస్తున్న పాలకవర్గాలు గద్దెనెక్కాక హామీలను విస్మరిస్తూ ప్రభుత్వ విద్యను ప్రమాదం లోకి నెడుతున్నారన్నారు.

సేవా రంగమైన ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యతల నుండి పాలకులు క్రమేపి తప్పుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వైసిపి ప్రభుత్వం జీవో 117 ను ప్రవేశపెట్టి, పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మార్చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాన్ని అప్పటి ప్రతిపక్ష హోదాలో తప్పు పట్టిన కూటమి పెద్దలు, తాము అధికారంలోకి రాగానే 117 జీవోను రద్దుచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తామని ప్రగల్పాలు పలికారని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం జీవో 117 ను పాక్షికంగా రద్దుచేసి, దాని స్థానంలో జీవో 20 ని అమలు చేశారే తప్ప విధానాల్లో మాత్రం ఏ మార్పు లేదన్నారు.బోధనేతర కార్యక్రమాల పేరుతో పేద విద్యార్థులకు విద్య అందకుండా ప్రభుత్వం చేసే కుట్ర అందులో భాగమేనన్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్య పరుస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమన్నారు.

పాలకుల విధానాల ఫలితంగా రాష్ట్రంలో 17వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పేదల పట్ల మక్కువ లేని పాలకవర్గాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్నారు. ప్రభుత్వ బడులు మూతపడితే పేద, బడుగు, బలహీనవర్గాలు విద్యకు దూరమవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులను కాపాడుకుంటూ పేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు యుటిఎఫ్ కృషి చేస్తున్నదని అందులో భాగంగానే “ఊరిని కాపాడుకుందాం” అనే నినాదంతో యుటిఎఫ్ కార్యాచరణ ప్రారంభించిందని పేర్కొన్నారు.

ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి మాసం నుండే విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించమని, విద్యార్థుల తల్లిదండ్రుల చైతన్య పరచడంతో పాటు, మేధావుల, విద్యావేత్తల, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఊరి బడిని కాపాడుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, యుటిఎఫ్ శ్రేణులు ఊరి బడి కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments