మందమర్రి, జనవరి 29 (మిర్రర్ క్రైమ్): ప్రతి రెండేళ్లకు ఒకసారి సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మందమర్రి ఏరియాలోని ఆర్‌కే–1ఏ గని జాతర ప్రాంగణం భక్తజన సంద్రమైంది.
వనదేవత సారలమ్మ జాతర సంప్రదాయ పూజలు, డప్పు చప్పుళ్ళు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు జోగినుల ఆటపాటలతో పటిష్ట బందోబస్తు నడుమ అమ్మవారిని గద్దెలపై ప్రతిష్టించారు, ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జిఎం ఎన్.రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పరిసర నుంచి భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.జాతర నేపథ్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగింది. ఇదే సందర్భంగా నేడు సమ్మక్క రాక ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
సమ్మక్క రాకతో జాతర మరింత ఉత్సాహంగా కొనసాగనుందని, భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. జాతర ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, పారిశుధ్య చర్యలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
భద్రత దృష్ట్యా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.జాతర సందర్భంగా భక్తులు క్రమశిక్షణ పాటించాలని,నిర్వాహకులు ,పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.





