క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన “మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర” సందడి మొదలైంది. కుంభమేళా తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఉత్సవం ఇదే.
తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని దట్టమైన అడవుల్లో ఈ వేడుక జనవరి 28 నుండి జనవరి 31, 2026 వరకు నాలుగు రోజుల పాటు వైభవంగా జరుగుతోంది. భక్తులు మేడారం చేరుకోగానే జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఒక ఆచారం.
భక్తుల రద్దీ కోసం TGSRTC ద్వారా 4,000 పైగా ప్రత్యేక బస్సులు, రైల్వే శాఖ ద్వారా 28 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. హన్మకొండ నుండి మేడారం వరకు పర్యాటక శాఖ ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది. కన్నెపల్లి నుండి “సారలమ్మ”, కొండాయి నుండి “గోవిందరాజు”, పూనుగొండ్ల నుండి “పగిడిద్ద రాజు” గద్దెలకు చేరుకోవడంతో సందడి మొదలవుతుంది.
నేడు జనవరి 29 గురువారం చిలకలగుట్ట నుండి “సమ్మక్క తల్లి” గద్దెపైకి వేంచేస్తారు. ఇది జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం. రేపు జనవరి 30 శుక్రవారం ప్రధాన భక్తి దినం. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, తమ బరువుకు సమానంగా “బంగారం” (బెల్లం) మొక్కుగా సమర్పించుకుంటారు.జనవరి 31 న శనివారం దేవతల వనప్రవేశం దీనితో నాలుగు రోజుల మహా జాతర ముగుస్తుంది.





