Ten Minutes Delivery: ఇటీవల బ్లింకిట్, జెప్టో ఇతర క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు కేవలం పది నిమిషాల్లో డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై డెలివరీ ఏజెంట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రిపేర్, ట్రాఫిక్ వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫామ్‌లైన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంస్థలకు 10 నిమిషాల డెలివరీ విధానం తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?
కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ.. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ సహా ఇతర క్విక్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమై డెలివరీ భాగస్వాముల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చర్చించారు. వేగంగా ఫుడ్ డెలివరీ ఇవ్వాలనే లక్ష్యంతో స్పీడ్ గా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. తమ ప్రాణాలతో పాటు, ఎదుటి వారికి ఇబ్బంది కలుగుతుందన్నారు. వెంటనే 10 నిమిషాల నిబంధనను తొలగించాలని ఆదేశించారు.
10 నిమిషాల నిబంధన తొలగించిన బ్లింకిట్!
కేంద్రం ఆదేశాల మేరకు బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ ఫాట్ ఫామ్‌లు 10 నిమిషాల డెలవిరీ క్లెయిమ్‌లను తొలగించినట్లు తెలిపింది. ఇతర కంపెనీలు తమ బ్రాండ్ ప్రకటనలు, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ల నుంచి ఈ డెలివరీ ప్రకటన తొలగిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెలివరీ ఏజెంట్లు ఇటీవల చేస్తున్న ఆందోళన దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల గిగ్ వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సేఫ్టీ గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు.





