
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లీడర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి.. రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లు ఉన్నా.. జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రాండ్ చెక్కుచెదరలేదు.
1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 2004, 2009లోనూ విక్టరీ కొట్టి హ్యాట్రిక్ సాధించారు. 2009లో వైఎస్సార్ రెండో కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుండి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2023 ఎన్నికల్లో తిరిగి నల్గొండ నుంచి మరోసారి విజయం సాధించి ఇప్పుడున్న కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా నాలుగుసాగ్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్ ఆయన నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. నల్గొండను వదిలేసి ఆయన మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 2027లో జరగనన్న జనాభా లెక్కల తర్వాత తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. రాష్ట్రంలో కొత్తగా 34 అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ 3 నుంచి నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. దీంతో నల్గొండను వదలేసి నకరేకల్ నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి పోటీ చేసే యోచనలో ఉన్నారని టాక్.
నకిరేకల్ నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీకి రిజర్వడ్ అయి ఉంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన వేముల వీరేశం అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ 2009కి ముందు వరకు జనరల్‌గా ఉంది నకిరేకల్ నియోజకవర్. 2009 తర్వాత ఎస్సీకి రిజర్వ్‌డ్ అయ్యింది. ఇప్పుడు మరోసారి డి లిమిటేషన్ జరుగుతుండటంతో.. ఈ నియోజకవర్గం మళ్లీ జనరల్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలను రామన్నపేట, చిట్యాల మండలాలను కొత్తగా ఏర్పడే చౌటుప్పల్ మండలాల్లో కలిపే అవకాశం ఉందట. దాంతో పక్కనే ఉన్న కొన్ని మండలాలను నకిరేకల్‌లో కలిపి జనరల్ నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే కోమటిరెడ్డి అక్కడి నుంచి పోటీ చేయాలని ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండతో ఇన్నాళ్లు ఉన్న అనుబంధాన్ని వదిలేసి నకిరేకల్‌లో పోటీ చేయడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు. ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గంలోనే మంత్రి వెంకట్ రెడ్డి సొంతూరు బ్రహ్మణ వెల్లంల ఉందట. అందుకే ఆయన నకిరేకల్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇన్నాళ్లు నాన్ లోకల్ నియోజకవర్గంలో పోటీ చేసిన మంత్రి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు సొంతూరులో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే కొన్ని రోజులుగా నకిరేకల్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్కువగా తిరుగుతున్నారని అంటున్నారు.