తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. రేవంత్ కేబినెట్ లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణ ఖాయమనే చర్చ సాగుతోంది. కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. దావోస్ నుంచి రాగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గాంధీభవన్ లో ప్రచారం సాగుతోంది.
కేబినెట్ విస్తరణపై ఉత్కంత కొనసాగుతోంది. కేబినెట్ పదవుల కోసం సీనియర్ నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో.. ఎవరికి మొండిచెయ్యి చూపుతారోననే ఆందోళన అశావాహుల్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు లేని ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో చోటు ఖచ్చితంగా కల్పిస్తారని అంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. భువనగిరి ఎంపీగా, మునుగోడు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో తిరిగి చేరినప్పుడే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.
అయితే తాను మంత్రి పదవి రేసులో వెనుకబడ్డానని భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి.. ఎందుకిలా జరుగుతుందని ఆరా తీశారట. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వాస్తుదోషమే కారణంగానే తనకు మంత్రిపదని రావడం లేదని భావిస్తున్నారని సమాచారం.దీంతో మునుగోడులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్పులు చేర్పులకు దిగారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మార్పులు చేపట్టారు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి.కార్యాలయంలో గోడలన్నీ కూల్చివేసి పునర్ నిర్మిస్తున్నారు. అలాగే డోర్లు, ఇతరత్రా మార్పులన్నీ చేస్తున్నారు. కార్యాలయంలో ఎమ్మెల్యే చాంబర్‌ను కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. మంత్రి పదవి ఆలస్యం కావటంతో… వాస్తు దోషం బాగోలేదని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూలగొట్టి మళ్లి కడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అందుకే పార్టీ కార్యాలయంలో మార్పులు చేస్తున్నారని చెబుతున్నారు. తనకు మంత్రి పదవి దక్కడం లేదనే కారణంగా చివరి అస్త్రంగా పార్టీ క్యాంపు ఆఫీసుకు మరమ్మత్తలు చేయిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఆయనకు మంత్రి పదవి దక్కని పక్షంలో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలిసింది.