తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం పార్టీ పెద్దలను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించడానికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారనే చర్చ సాగుతోంది. దసరాకు ముహుర్తం పెట్టిన రేవంత్.. అంతలోపే పార్టీ పెద్దలతో మాట్లాడి కేబినెట్ భర్తీలపై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఇటీవలే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచించడం వల్లే మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు వచ్చాయని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలోనూ సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వాళ్లకే పెద్దపీట వేయనున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
కేబినెట్ బెర్తుల విషయానికి వస్తే ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చోటు లేదు. ఈ జిల్లాల నుంచి ఒక్కొక్కరికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ఛాయిస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డేనని చెబుతున్నారు. 2023 ఎన్నికల ముందు రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడే ఆయనకు మంత్రిపదవి ఇస్తామని అధిష్టాన దూతలు స్పష్టమైన హామీ ఇచ్చారంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి సీటును గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని తెలుస్తోంది. ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీ మేరకు భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
నిజానికి కేబినెట్ లో రెడ్డికి చోటు దక్కడం అంత ఈజీగా లేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి రేసులో ఉన్నారు. వీళ్లలో ఇద్దరికి ఖాయమే. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చోటు దక్కడం చాలా కష్టం. కాను ముందే హామీ ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. దసరా కానుకగా మంత్రిపదవి రాబోతుందని తన అనుచరులకు రాజగోపాల్ రెడ్డి చెప్పారని అంటున్నారు.