తెలంగాణరాజకీయం

కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి? – ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొస్తా!

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు మళ్లీ హాట్‌స్పాట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రాజకీయంగా సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, త్వరలోనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకోవచ్చని సమాచారం.

కేబినెట్‌లో చోటు దక్కకపోవడం, నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యం లభించకపోవడం ఆయన అసంతృప్తికి కారణాలుగా చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన సంబంధాలు సరైన మార్గంలో సాగలేదన్నది పార్టీ వర్గాల్లో చర్చగా మారింది.

బీఆర్ఎస్? లేదా స్వతంత్రంగా? 

రాజీనామా తర్వాత బీఆర్ఎస్‌లోకి వెళ్తారా, లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగతారా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రాజగోపాల్ రెడ్డి ఇటీవల పరోక్షంగా సంప్రదింపులు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి “అసలైన అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడతాను” అనే నినాదంతో ముందుకు రావచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

“ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకొస్తా!”

రాజీనామా చేసిన తర్వాత మునుగోడులో మళ్లీ ఎన్నికలు వస్తే, అదే తన అసంతృప్తిని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక వేదికగా మారుతుందన్న అంచనాలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. “ప్రజల కోసం, అభివృద్ధి కోసం అవసరమైతే పదవిని త్యాగం చేస్తాను. ప్రభుత్వాన్ని వారి పాదాల వద్దకు తీసుకెళ్తాను” అని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

ఇది తొలిసారి కాదు…గతంలోనూ 2022లో ఇదే మునుగోడు నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్, ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

పార్టీ నేతల మౌనం…రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిపై కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఓపెన్‌గా స్పందించకపోవడం గమనార్హం. ఇది ఆయన దూకుడును మరింత పెంచుతోందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Back to top button