
మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు బైపాస్ చేయాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. కొడాలి నానికి గుండెపోటు అని తెలియగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొడాలి నాని పెద్దగా బయట కనిపించడంలేదు. ఆయన వాయిస్ పూర్తిగా తగ్గిపోయింది. వైసీపీ ఓటమి తర్వాత కొడాలి నాని హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యమైన పార్టీ సమావేశాలు ఉంటేనే ఏపీకి వస్తున్నారు. పైగా… మంత్రి లోకేష్ రూపొందించిన రెడ్‌బుక్‌లో కొడాలి నాని పేరే ముందు వరుసలో ఉందని సమాచారం. పోసాని, వల్లభవనేని వంశీ అరెస్ట్ తర్వాత… కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది.
Also Read : విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు?
హైదరాబాద్‌లో ఉంటున్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు.. వెంటనే గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కొడాలి నానిని పరీక్షించిన వైద్యులు.. ఆయనకు గుండెపోటు వచ్చినట్టు గుర్తించారు. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే.. బైపాస్ సర్జరీ చేయాలని సూచించినట్టు సమాచారం. కొడాలి నాని కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని పెద్ద నాయకులు ఆస్పత్రికి ఫోన్ చేసి వైద్యులతో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.