తెలంగాణ

కొడకా బీ కేర్‌ ఫుల్‌… బండి సంజయ్‌పై ఈటల ఫైర్‌

  • నేను శత్రువుతో కొట్లాడుతా…

  • కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను

  • కరీంనగర్‌లో నా అడుగుపడని ఊరులేదు

  • రాష్ట్రంలోనే నేను మాట్లాడని జాతి లేదు

  • నా గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది: ఈటల

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తలెత్తాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల వర్గానికి టికెట్లు ఇచ్చేది లేదంటూ ఇటీవల బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. దీంతో బండి సంజయ్‌పై ఈటల తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కొడకా బీ కేర్‌ ఫుల్‌ అంటూ స్ట్రాంగ్‌ వార్నింగిచ్చారు ఈటల.

శామీర్‌పేటలోని ఈటల నివాసానికి కరీంనగర్‌ జిల్లా నుంచి ముఖ్యనేతలంతా తరలివచ్చారు. ముఖ్యంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఈటల వర్గానికి టికెట్ల ఇవ్వబోమంటూ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలతో నేతలంతా అలర్టయ్యారు. తనను కలిసేందుకు వచ్చిన నేతలతో ఈటల మాట్లాడుతూ నేను స్ట్రెయిట్‌గానే ఫైట్‌ చేస్తా… నీలాగా స్ట్రీట్‌ ఫైట్‌ చేయనంటూ సంజయ్‌నుద్దేశించి ఈటల వ్యాఖ్యానించారు. కుట్రలు, కుతంత్రాలు చేసే వారి సంగతి తేలుస్తానంటూ ఈటల హెచ్చరించారు.

కొడకా బీ కేర్‌ ఫుల్‌

వాడెవడు సైకోనా… శాడిస్టా… మనిషా… పశువా… ఏ పార్టీలో ఉన్నాడు. ఎవని అండతో ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. కొడుకా బీ కేర్‌ ఫుల్‌ అంటూ ఈటల పంచ్‌ డైలాగులు వదిలారు. తాము శత్రువులతో కొట్లాడుతాం కానీ… కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే రకం కాదన్నారు. సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెడుతూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి సంగతిని అధిష్ఠానంతో చెబుతానన్నారు.

కరీంనగర్‌లో నా అడుగుపడని ఊరులేదు

నీ శక్తి ఏంది? యుక్తి ఏంది?. 2002లో జిల్లాకు వచ్చావు.. నేను కరీంనగర్‌ జిల్లాకు రెండుసార్లు అధ్యక్షుడిగా చేశా, రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేశానని ఈటల వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లేవని, హుజూరాబాద్‌, కమలాపూర్‌కే కాదు… కరీంనగర్‌ జిల్లా మొత్తం నా వెంబడే వచ్చేదని గుర్తు చేశారు. తన చరిత్ర ఏంటో తెలుసుకొని మాట్లాడాలని సంజయ్‌కి పరోక్షంగా ఈటల సూచించారు.

హుజూరాబాద్‌లో ప్రతి ఊరిలో మనవారే

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్ని ఓట్లు పడ్డాయో, ఎంపీకి కూడా అన్ని ఓట్లే వేయించానని తెలిపారు ఈటల. ఈ విషయం అతని అంతరాత్మకు తెలుసని అన్నారు. కేసీఆర్‌, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలాంటి వాళ్లతో కొట్లాడా, బండి సంజయ్‌ తనకు ఒక లెక్కకాదన్నారు ఈటల. హుజూరాబాద్‌ గడ్డపై వచ్చే ఎన్నికల్లో ప్రతి ఊరిలో మన సర్పంచ్‌, మన వార్డు మెంబరే ఉంటారని స్పష్టం చేశారు ఈటల.

 

Read Also: 

  1. సీఎం రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌
  2. అన్యమత ఉద్యోగులపై టీటీడీ కఠిన చర్యలు
Back to top button