Tuesday, March 3, 2026
Homeతెలంగాణరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేని స్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ లేఖ రాశారు. గతంలో తీసుకున్న అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయడం, ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు అప్పులు తీసుకోవడం, రైతు భరోసా నిధులు, సంక్షేమ పథకాల అమలుకు కూడా అప్పులపైనే ఆధారపడడం వంటి పరిస్థితులు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

2014లో మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మరియు గత 27 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని ఆయన విమర్శించారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న తలసరి అప్పు రాష్ట్ర ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన ఆర్థిక గణాంకాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 ప్రధాన హామీలతో పాటు 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల అమలులో వెనుకంజ వేస్తూ ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం సరైంది కాదన్నారు. ఒకవైపు ఖజానా పరిస్థితిపై వ్యాఖ్యలు చేస్తూ, మరోవైపు పార్టీ అవసరాలకు భారీ నిధులు ఇవ్వడానికి సిద్ధమని చెప్పడం విరుద్ధ ధోరణి కాదా అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ సహకారం విషయానికి వస్తే, 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. గత 12 సంవత్సరాల్లో సుమారు రూ.12 లక్షల కోట్ల మేర నిధులు వివిధ పథకాలు, పన్నుల వాటాలు, మూలధన పెట్టుబడుల రూపంలో అందించబడ్డాయని చెప్పారు. ఇందులో రూ.2.5 లక్షల కోట్ల పన్నుల వాటా, రూ.1.85 లక్షల కోట్ల రహదారి నిర్మాణాలు, రూ.36,000 కోట్లకు పైగా రైల్వే కేటాయింపులు, నిర్మాణంలో ఉన్న మరో రూ.50,000 కోట్ల పనులు, రూ.40,000 కోట్ల ఉపాధి హామీ నిధులు, రూ.50,000 కోట్ల ఉచిత రేషన్ బియ్యం, రూ.40,000 కోట్లకు పైగా స్థానిక సంస్థల నిధులు, రూ.12,000 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు, రూ.14,000 కోట్ల పీఎం కిసాన్ నిధులు, రూ.80,000 కోట్ల ఎరువుల సబ్సిడీ, రూ.21,000 కోట్ల విద్య, క్రీడా నిధులు, రూ.9,000 కోట్ల ఆరోగ్య రంగ నిధులు ఉన్నాయని వివరించారు. అదనంగా రైతుల నుంచి వరి ధాన్యం, పత్తి కొనుగోలు కోసం లక్షల కోట్ల కనీస మద్దతు ధర చెల్లించిందని పేర్కొన్నారు.

రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం కేంద్రం ప్రారంభించిన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం ద్వారా 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. 2020-21 నుంచి 2025-26 వరకు తెలంగాణకు రూ.10,000 కోట్లకు పైగా వడ్డీ రహిత రుణాలు లభించాయని చెప్పారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా మురుగునీటి కాల్వలు, రోడ్ల విస్తరణ, రైల్వే మార్గాల అభివృద్ధి, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఆసుపత్రులు, నివాస పాఠశాలలు, పర్యాటక మౌలిక వసతులు వంటి అనేక ప్రాజెక్టులు అమలవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా ఎంఎంటిఎస్ రెండో దశ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గం, స్మార్ట్ నగరాల పథకం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఓఆర్ఆర్-ఆర్ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్లు, సిద్ధిపేట బైపాస్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు వినియోగించబడ్డాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కూడా కేంద్ర వడ్డీ రహిత రుణాలపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక స్థితిని సూచిస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ALSO READ: Gold Storage Limit: ఇంట్లో ఎంత బంగారం ఉండొచ్చు.. లెక్కలివే!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments